- మంత్రి తుమ్మల చొరవతో 330 మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభం
- కేంద్రం, సీసీఐ సీఎండీతో చర్చలు సఫలం
హైదరాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లలో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్త రూల్స్ కారణంగా అనుమతులు నిలిచిపోయిన 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్రంలో 4.03 లక్షల టన్నుల పత్తిని సేకరించగా, మొత్తం కొనుగోలు విలువ రూ.3,201 కోట్లకు చేరినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
చర్చలు సఫలం అవడంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు మరింత వేగవంతం కానున్నట్టు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. మంత్రి చొరవతో సీసీఐ నుంచి మొత్తం 330 మిల్లులకు అనుమతులు లభించాయని అధికారులు చెప్పారు. సీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ సమ్మె చేపట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కెట్ యార్డుల్లో పత్తి ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో నాణ్యత దెబ్బతినే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తుమ్మల జోక్యం చేసుకుని చర్చలు జరపడంతో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
సమస్యను పరిష్కరించడంలో మంత్రి తుమ్మల చూపిన చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతర సంప్రదింపులతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, మిల్లు కార్మికులకు భారీ ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.
