ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి జూలై 20 నుంచి కౌన్సెలింగ్

ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి జూలై 20 నుంచి కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్‌‌, బీడీఎస్ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం షెడ్యూల్ రిలీజ్​ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను ఆల్‌‌ ఇండియా కోటా కింద భర్తీ చేయనున్నారు. కాలేజీలు, సీట్ల వివరాలు ఈ నెల 20న ఎంసీసీ, ఎన్‌‌ఎంసీ వెబ్‌‌సైట్‌‌లలో అందుబాటులో ఉంచుతామని, అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌‌లైన్‌‌ రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియ మొదలవుతుందని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. 

ఈ నెల 22 నుంచి 26 వరకు వెబ్‌‌ ఆప్షన్ల నమోదుకు గడువు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నెల 29న సీట్ అలాట్‌‌మెంట్ లిస్ట్ విడుదల చేస్తామని, ఆగస్ట్‌‌ 4 లోపు కాలేజీల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఆగస్ట్ 7 నుంచి 28 వరకు సెకండ్ ఫేజ్, 31 నుంచి సెప్టెంబర్ 18 వరకు థర్డ్ ఫేజ్‌‌ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. థర్డ్ రౌండ్ తర్వాత మిగిలిన సీట్లకు సెప్టెంబర్ 21 నుంచి స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. 

మన రాష్ట్రంలోనూ దాదాపు ఇదే తేదీల్లో కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉంది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ప్రక్రియను ఇదివరకే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నెల 17 వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, వెబ్‌‌ ఆప్షన్ల షెడ్యూల్ ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు.