
అనాథలైన ఇద్దరు చిన్నారులు
గజ్వేల్,వెలుగు: గ్రామమంతా వన భోజనాలకు సిద్ధమవుతున్న వేళ పొలంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో దంపతులు మృతిచెందటం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ శివారులో ఆదివారం ఉదయం జరిగింది. గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన మానుక వెంకటేశ్ గౌడ్(30), మానుక రేవతి(26) దంపతులు వర్గల్ శివారులో వారికి ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలు అశోక్ గౌడ్(7), తనీషా(4)లను పోషించుకుంటున్నారు. ఆదివారం గ్రామంలో వన భోజనాలు ఉన్నాయి. అయితే వెంకటేశ్ గౌడ్, రేవతిలు తమ పొలంలో వేసిన స్వీట్ కార్న్ కంకులను తెంపి మార్కెట్కు పంపించి వనభోజనాలకు వెళ్దామని అనుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున పొలం వద్దకు ట్రాలీ ఆటోలో వెళ్లారు. కంకులు తెంపి ట్రాలీ ఆటోలో వేసుకున్నారు. తర్వాత కాళ్లు చేతులు కడుక్కుందామని చేలోని ఫామ్ పాండ్లోకి దిగారు. అందులో నీటిని తోడటానికి ఏర్పాటు చేసిన సబ్మర్సిబుల్ మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరూ షాక్ కు గురై చనిపోయి నీటిలో మునిగిపోయారు. కొంతసేపటి తర్వాత నీరు పట్టుకోవడానికి అక్కడకు వచ్చిన సమీప రైతు విషయాన్ని గుర్తించి మృతుల కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకునే సరికి ఇద్దరు నీటిలో మునిగిపోయి ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పట్టుకుని అలానే నీటిలో మునిగివున్న దృశ్యం అక్కడకు వచ్చిన వారందరినీ కంటతడి పెట్టించింది. తల్లితండ్రులిద్దరు చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. గౌరారం పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.