అప్పు తీర్చాలన్నందుకు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు. నిందితులు ఒకామె దగ్గర రూ.20 వేలు, మరో మహిళ వద్ద లక్షన్నర అప్పుగా తీసుకున్నారు. వాళ్లు డబ్బులు తిరిగి అడగడంతో నమ్మించి ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి హత్య చేశారు. వికారాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
చేవెళ్ల/తాండూరు, వెలుగు: అప్పు తీర్చమన్న పాపానికి ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు. వికారాబాద్‌జిల్లా తాండూరు నియోజకవర్గంలో నమోదైన ఇద్దరు మహిళల మిస్సింగ్కేసులను పోలీసులు ఛేదించారు. బషీరాబాద్ మండలం కాశీంపూర్ కు చెందిన అంగన్ వాడీ ఆయా అబేదా బేగం(60) మే 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమారుడు 9న బషీరాబాద్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె వద్ద అప్పు తీసుకున్న తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీం బీ, ఆమె భర్త రెహమాన్.. మొయినాబాద్మండలం తోల్కట్ట పరిధిలోని దాసరి పద్మ ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డు నయీమ్ సహకారంతో అబీదా బేగంను హత్య చేసినట్లు తేల్చారు. ఈమెతోపాటు రెండు నెలల కింద అదృశ్యమైన ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబా బేగం(65)ను కూడా చంపేసి, పామ్‌హౌస్ పక్కన పాతిపెట్టినట్లు గుర్తించారు.
- అప్పు తీరుస్తామని పిలిచి..
పోలీసుల విచారణలో విస్తపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మహబూబా బేగం వద్ద నిందితులు మూడు నెలల కింద రూ.20 వేలు అప్పు తీసుకున్నారు. ఆమె డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇస్తామని చెప్పి, తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌కు పిలిపించారు. సెక్యూరిటీ గార్డు నయీమ్సహకారంతో ఆమెను చంపేసి ఫామ్‌హౌస్ పక్కన పూడ్చిపెట్టారు. అలాగే, అబేదాబేగం వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆమెను కూడా ఇలాగే నమ్మించి ఫామ్ హౌస్‌కు రప్పించి హత్య చేశారు. మృతదేహాన్ని ఫామ్‌హౌస్ పక్కనే మరోచోట పాతిపెట్టారు. అంతేకాదు, చంపడానికి ముందు ఇద్దరు మృతుల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కున్నారు.
- ఫోన్ లాస్ట్ సిగ్నల్ ఆధారంగా..
అబేదాబేగం మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన యాలాల్పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొయినాబాద్ మండలం తోల్కట్ట వద్ద లాస్ట్ సిగ్నల్ చూపించడంతో ఇక్కడి పోలీసుల సహకారం తీసుకున్నారు. ఆమె చివరగా కరీం బీ, రెహమాన్ తో మాట్లాడినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా తోల్కట్ట గ్రామానికి చెందిన నయీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో అతను జరిగిందంతా చెప్పేశాడు. 14 రోజుల కింద అబేదా బేగంను, 2 నెలల కింద మహబూబా బేగంను చంపినట్లు ఒప్పుకున్నాడు. శనివారం ముగ్గురు నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ముందుగా మహబూబా బేగం అస్థిపంజరాన్ని, తర్వాత కొద్ది దూరంలో పాతిపెట్టిన అబేదా బేగం మృతదేహాన్ని వెలికితీశారు. విచారణ కొనసాగిస్తున్నట్లు తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
