
- కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య
- వడ్డీలకు అప్పులిచ్చి బతుకుతున్న భార్యాభర్తలు
- ఒంటరిగా ఉంటుండడంతో టార్గెట్ చేసిన దుండగులు
బీర్కూర్, వెలుగు : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రైతునగర్‌కు చెందిన దారం నారాయణ గుప్తా(70), సులోచన(65) దంపతులు. వీరికి పిల్లలు లేరు. ఇంట్లోనే కిరాణా షాప్నడుపుతూ డబ్బులను వడ్డీలకు తిప్పుతూ బతుకుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి వీరుండే ఇంటి వెనుక నిచ్చెన వేసిన దుండగులు లోపలకు చొరబడ్డారు. నారాయణ గుప్తా తలపై బలంగా కొట్టి చంపేశారు. తర్వాత సులోచనను ఇంట్లో దూలానికి చీరతో ఉరేసి హత్య చేశారు. నారాయణ దంపతులు రూ. లక్షల్లో అప్పులు ఇచ్చేవారని, తీసుకున్న వారిలో ఎవరైనా తీర్చే ఉద్దేశం లేక హత్య చేసి ఉంటారేమోనని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రాత్రి టీవీ సౌండ్ పెద్దగా వినిపించిందని, సినిమా చూస్తున్నారని అనుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు.
రైతునగర్ గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో బీర్కూరు, బాన్సువాడ పట్టణాలున్నాయి. మెయిన్ రోడ్డుపై ఉండే ఈ ఊరిలోని వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారని గమనించి ఎవరైనా డబ్బుల కోసం హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఘటనాస్థలాన్ని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, బాన్సువాడ రూరల్‌సీఐ మురళి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో గాలించగా అవి మృతుల ఇంటి నుంచి బ్యాంక్చుట్టుపక్కల తిరిగాయి. క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. ఘటనపై డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఇంట్లో కొన్ని వస్తువులు పోయాయని గుర్తించామని, కానీ దాని ఆధారంగా దొంగలే ఈ పని చేసి ఉంటారని అనుకోవడానికి లేదన్నారు. కొందరు ఇది దోపిడీ హత్య అని నమ్మించడానికి కూడా చేస్తారన్నారు. సాధ్యమైనంత తొందరలో నిందితులను పట్టుకుంటామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ రూరల్‌సీఐ మురళి తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతునగర్ వచ్చి వివరాలడిగి తెలుసుకున్నారు.