హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యా రంగంలో తెలంగాణలో అమలవుతున్న విధానాలు, ప్రగతిశీల సంస్కరణలు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ‘శాస్త్రి ఇండో–కెనడియన్ ఇన్‌స్టిట్యూట్’ ఆధ్వర్యంలో సదరన్ రీజినల్ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకిష్టారెడ్డి ప్రసంగించారు.
ప్రస్తుత విద్యా విధానం పాత పద్ధతుల్లో కాకుండా.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మారాలని సూచించారు. సంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి, ఇండస్ట్రీకి ఏం కావాలో తెలుసుకుని సిలబస్‌ను మార్చుకోవాలన్నారు. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాదని, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఉపాధి పెంచేలా యూనివర్సిటీలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నల్సార్ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు, ఎస్ఐసీఐ డైరెక్టర్ డాక్టర్ ప్రచి కౌల్ తో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 25 మంది వీసీలు, డీన్లు హైబ్రిడ్ మోడ్‌లో హాజరయ్యారు.
