బోనాల సందర్భంగా మహిళల్ని వేధించిన ఏడుగురికి జైలు శిక్ష

బోనాల సందర్భంగా మహిళల్ని వేధించిన ఏడుగురికి జైలు శిక్ష

మహిళలను వేధించిన కేసుల్లో న్యాయస్థానం ఏడుగురికి జైలు శిక్ష విధించింది. వారంతా గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు హైదరాబాద్ షీ టీమ్ అడిషనల్ సీపీ ఎ.ఆర్. శ్రీనివాస్ చెప్పారు. నిందితులు బోనాల సందర్భంగా దేవలయాలకు వచ్చిన మహిళలకు తెలియకుండా వారి ఫోటోలు తీయడంతో పాటు తాకుతూ వేధింపులకు పాల్పడ్డారు. షీ టీమ్స్ బృందాలు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని  కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం కోర్టు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. 

గోల్కొండ బోనాల సందర్భంగా మహిళల్ని వేధించిన మలక్ పేటకు చెందిన ఎస్ నాగరాజు, షేక్ ఆర్జడ్ అలీ, పి.కిరణ్లకు కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఇక సికింద్రాబాద్ బోనాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన శ్రీకాంత్, సాయిలు, ఖాజా నసీరుద్దీన్లకు3 రోజుల జైలుతో పాటు ఫైన్ విధించారు. అబ్దుల్ మెహమూద్ ఖాన్ అనే మరో వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష విధించినట్లు షీ టీమ్ అడిషనల్ సీపీ ఎ.ఆర్. శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నగరమంతటా షీ టీమ్ బృందాలు మఫ్టీలో తిరుగుతూనే ఉంటారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.