ఫుల్ టైం గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్!

ఫుల్ టైం గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్!
  •  త్వరలో ప్రకటించనున్న కేంద్రం?
  •  వరుసగా మూడో తమిళ వ్యక్తికి చాన్స్
  •  3,4 నెలల్లో 9 రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం పూర్తి
  •  పలు రాష్ట్రాల్లో టికెట్లు దక్కని సీనియర్లకు గవర్నర్లుగా అవకాశం
  •  రేసులో కిరణ్​ కుమార్ రెడ్డి, అశ్విన్ కుమార్ చౌబే

హైదరాబాద్: సీపీ రాధాకృష్ణన్ ను తెలంగాణ పూర్తిస్థాయి గవర్నర్ గా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. జార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్న రాధాకృష్ణన్.. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్ఛేరికి ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన తెలంగాణలో పూర్తి స్థాయి గవర్నర్ గా కొనసాగాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే జరిగితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన ముగ్గురు గవర్నర్లు తమిళులే అవుతారు. 

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగారు. ఆ తర్వాత బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా కొనసాగిన తమిళిసై సౌందర రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా కేంద్రం నియమించింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను కేంద్రం తెలంగాణ ఇన్ చార్జి గవర్నర్ గా నియమించింది. దాదాపు మూడు నెలలుగా సీపీ రాధాకృష్ణన్ ఇన్ చార్జి గవర్నర్ గా కొనసాగుతున్నారు. 

కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ సహా తొమ్మిది రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం మరో మూడు నాలుగు నెలల్లో ముగియనుంది. కర్నాటక, తెలంగాణ గవర్నర్లుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అశ్విన్ కుమార్ చౌబేలను నియమిస్తారనే ప్రచారం కూడా ఓ వైపు సాగుతోంది. హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత లేదా అంతకన్నా ముందే గవర్నర్ల నియామకాలు చేపట్టవచ్చని సమాచారం. ఎంపీలుగా అవకాశం దక్కని వారిని ఈ రాష్ట్రాలకు గవర్నర్లుగా  నియమించే అవకాశం ఉంది.

 తెలంగాణ నుంచి సీనియర్ నేతలు సీహెచ్ విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర), బండారు దత్తాత్రేయ (హర్యానా), ఎన్ ఇంద్రసేనారెడ్డి (త్రిపుర)లను గవర్నర్లుగా కేంద్రం నియమించింది. విద్యాసాగర్ రావు పదవీకాలం పూర్తి చేసుకుని స్వరాష్ట్రానికి తిరిగి రాగా, మరో ఇద్దరు గవర్నర్లుగా పనిచేస్తున్నారు.  ప్రస్తుతం తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమిస్తే రాధాకృష్ణన్ కే మొదటి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.