సైలె న్స్ గా సైరన్ లేకుండా సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ !

సైలె న్స్ గా  సైరన్ లేకుండా  సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ !
  • సౌత్ వెస్ట్ జోన్​లోని  రౌడీషీటర్ల ఇండ్లకు సీపీ  
  • పడుకున్న వారిని లేపి కౌన్సెలింగ్
  • అర్ధరాత్రి దాటినా తెరిచిన  హోటళ్లు, దుకాణాల్లోకి వెళ్లి వార్నింగ్

హైదరాబాద్​సిటీ, వెలుగు : హైదరాబాద్ ​సీపీ సజ్జనార్​ఆదివారం అర్ధరాత్రి సైరన్​లేకుండా సైలెన్స్​గా సౌత్ వెస్ట్ జోన్‌‌ లంగర్ హౌస్, టోలిచౌకి పీఎస్ ​పరిధిల్లోని బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్​ నిర్వహించారు. హంగూ ఆర్భాటం, సైరన్​ లేకుండా పెట్రోలింగ్ వాహనంలో అర్ధరాత్రి12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇండ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ​ఇచ్చారు. తెరిచి ఉన్న దుకాణాలు, టిఫిన్​ సెంటర్ల దగ్గరకు వెళ్లి నిర్వాహకులతో మాట్లాడారు. 

రౌడీషీటర్లను నిద్ర లేపి..

లంగ‌‌ర్ హౌస్​పీఎస్ ప‌‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్ కాలనీల్లోని పలువురు రౌడీ షీటర్ల ఇండ్లకు వెళ్లారు. నిద్రపోతున్న రౌడీ షీటర్లను లేపి ‘ఇప్పుడేం చేస్తున్నారు..సాధారణ జీవితం గడుపుతున్నారా లేదా? ఏం పని చేస్తున్నారు. ఇల్లు ఎలా గడుస్తుంది?’ అని పలు ప్రశ్నలు వేశారు. నేరాలవైపు వెళ్లే ఆలోచన ఉంటే మానుకోవాలని, లేకపోతే యాక్షన్​తప్పదని హెచ్చరించారు. 

అర్ధరాత్రి వేళ దందా ఏంది? 

టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి నేరుగా వెళ్లిన కమిషనర్ ​తెల్లవారుజాము వరకు వ్యాపారాలు కొనసాగించడంపై ఫైర్​అయ్యారు. మరోసారి తాను పరిశీలనకు వస్తానని రిపీట్​అయితే కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే, టోలీచౌకి పీఎస్​కు వెళ్లిన ఆయన జనరల్ డైరీ, రాత్రి ఎంట్రీలు పరిశీలించారు. డ్యూటీలు చేస్తున్న కానిస్టేబుల్స్, అధికారులను మాట్లాడారు. విధులు నిర్వర్తించే టైంలో వచ్చే ఇబ్బందులు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో పోలిసింగ్​ను బలోపేతం చేయడంతోపాటు ఫీల్డ్​ లెవెల్​లో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు.