
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ సీపీ వీసీ సజ్జనార్ కొత్త పోలిసింగ్ విధానంలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాహనదారుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో సేఫ్ రైడ్ చాలెంజ్ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనదారులు ప్రయాణం స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి భద్రతా చర్యలను పాటిస్తూ ఒక చిన్న వీడియో లేదా ఫొటో తీసి ముగ్గురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.
ఇలా చేయడం ద్వారా అతిగా సోషల్ మీడియా ఉపయోగించే యువతలో మార్పు తీసుకురావచ్చని.. వారికి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన తేవొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అందరం కలిసి సేఫ్టీని 2025లో కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదామని పిలుపునిచ్చారు. సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులపై అలవాటును పెంపొందించడమే ఈ చాలెంజ్ ప్రధాన లక్ష్యమన్నారు.