హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు అనుమతితోనే కాలం–-6కు సవరణలు తెచ్చామని గతంలో ఈసీ ప్రకటించిందని, అయితే ఇదంతా అవాస్తవమని, కేవలం అబద్ధాల పుట్ట అని ఇప్పుడు అర్థమవుతోందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు వ్యవహారమంతా నడిచిందని ఆరోపించారు. వారి ప్రత్యక్ష సహకారంతోనే దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల ఓట్లను తొలగించేందుకు పెద్ద కుట్రకు తెరలేపారన్నారు. ఎన్నికల సంఘంలో ఉన్న మిగతా ఇద్దరు కమిషనర్లు ఏకంగా 14 సార్లు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వారి మాటలను కనీసం లెక్కచేయకుండా నిరంకుశంగా, పూర్తిగా ఏకపక్షంగా సీఈసీ నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు.
