వివాదాలపై సెంటిమెంట్లు రెచ్చగొట్టొద్దు : సీపీఐ జాతీయ కంట్రోల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నారాయణ

వివాదాలపై సెంటిమెంట్లు రెచ్చగొట్టొద్దు : సీపీఐ జాతీయ కంట్రోల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నారాయణ
  • ఇద్దరు సీఎంలు చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి:నారాయణ

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంటేనే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని సీపీఐ జాతీయ కంట్రోల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నారాయణ అన్నారు. అనవసరమైన సెంటిమెంట్లు రెచ్చగొట్టవద్దని కోరారు. శుక్రవారం ఆయన మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ..  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జలవివాదాలు, పోర్టులు, రవాణా వంటి అంశాలపై ఏపీతో చర్చిస్తామని చెప్పారని తెలిపారు. అలాగే, ఏపీ సీఎం చంద్రబాబు కూడా నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారని గుర్తుచేశారు. 

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవడమే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు శాశ్వత పరిష్కారమని వివరించారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. తెలంగాణ, ఏపీల్లోని ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్​అయ్యారు. 

తెలంగాణ, ఏపీ సీఎంలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చర్చించి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఎవరి బెదిరింపులకు, బ్లాక్‌‌‌‌మైలింగ్‌‌‌‌కు లోబడాల్సిన అవసరం లేదన్నారు. ఈ దిశగా ముందడుగు వేయాలని కమ్యూనిస్టు పార్టీ కోరుతున్నదని నారాయణ స్పష్టం చేశారు.