- డీకే అరుణకు ధైర్యముంటే నల్గొండలో మాట్లాడాలి
- సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, నెల్లికంటి సత్యం
హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల మధ్య నీటి పంచాయితీలు రాజేసి, దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న ప్రజల తాగు, సాగునీటి హక్కులను కాలరాయొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు జీవనాధారమైన డిండి ఎత్తిపోతల పథకంపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున.. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీరందించే పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆ జిల్లా నీళ్లు ఆ జిల్లాకే అనే వాదనలు తెలంగాణ ఐక్యతకే గొడ్డలిపెట్టన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌లోనే మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే అంశం స్పష్టంగా ఉందని పల్లా గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ 2024 సెప్టెంబర్ 22న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీరివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించిందని, 2025 జనవరి 22న రూ.1,800 కోట్లతో జీవో జారీ చేసి టెండర్లు పూర్తి చేసిందన్నారు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు తరలిస్తున్నప్పుడు నల్లగొండ ప్రజలు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని.. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ నేతలు వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. డిండి పథకంపై ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిండి పథకాన్ని అడ్డుకోవాలని చూడడం అంటే మునుగోడు, దేవరకొండ ప్రజల గొంతు ఎండగట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న నల్లగొండ జిల్లాకు చట్టబద్ధమైన నీటి హక్కు ఉందని, డీపీఆర్‌లో అర టీఎంసీ కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు.
