- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పని వేళలు, ఉద్యోగ భద్రతకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగుల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పేరుకు వైట్ కలర్ ఉద్యోగులైనప్పటికీ విపరీతమైన పనిగంటలతో మానసిక ఒత్తిడికి గురై ఇబ్బందులు పడుతున్నారని, చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు.వారి ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోయిందని, ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగాలు తీసివేయడం, రాజీనామా చేస్తే డబ్బులు చెల్లించాలనే అగ్రిమెంట్లు రాయించుకోవడంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవని పేర్కొన్నారు.
