దళిత బంధు పేరుతో ఊరికో కోడి.. ఇంటికో ఈక ఇచ్చారు : నారాయణ​

దళిత బంధు పేరుతో ఊరికో కోడి.. ఇంటికో ఈక ఇచ్చారు : నారాయణ​

భద్రాద్రికొత్త గూడెం, వెలుగు: అసెంబ్లీ సీట్ల కోసం నీతి మాలిన రాజకీయం చేయబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సీట్లను అడుక్కోవడం కాదని, అది తమ రాజకీయ హక్కు అని పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు రాజకీయ సన్యాసం తీసుకోలేదని, చట్ట సభల్లో ఉండాలనుకుంటున్నామని చెప్పారు. కమ్యూనిస్టులు చట్ట సభల్లో లేకపోతే ప్రజా సమస్యలపై మాట్లాడే వారే ఉండరన్నారు. కేసీఆర్ చాలా తెలివైన వాడు, కానీ అతి తెలివికి పోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సీపీఐ పాత్రను మరువద్దన్నారు. పోడు భూములకు ఇంతవరకు పట్టాలివ్వలేదని, పది శాతం మందికే పట్టాలిస్తామనడం సరికాదన్నారు. దళిత బంధు పేర ఊరికో కోడి, ఇంటికో ఈక ఇచ్చారని విమర్శించారు. బీజేపీని ఎదుర్కొవాలంటే ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే తీర్చాలని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. బీజేపీ, ఆర్‌‌ఎస్‌ఎస్‌లను ఎదిరించే శక్తి కమ్యూనిస్టులకే ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోడీకి పిల్లలు లేరు.. కానీ, దత్తపుత్రులు 30 మంది ఉన్నారన్నారు. ఎన్నికల కమిషనర్ ఆర్‌‌ఎస్‌ఎస్ చెప్పు చేతుల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బీజేపీకి కట్టుబానిసగా పనిచేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

సీపీఐ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరులో సీపీఐ పాత్ర మరువలేనిదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదనే విషయాన్ని మర్చిపోవద్దని కేసీఆర్‌‌కు సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే క్రమంలోనే బీఆర్‌‌ఎస్‌కు మునుగోడులో మద్దతిచ్చామని, మీరు కూడా తమకు సపోర్ట్ చేయాలని కోరారు. కమ్యూనిస్టులు సీట్లు అడుక్కోరనే విషయాన్ని గమనించాలన్నారు. కమ్యూనిస్టులు అమ్ముడు పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేసే బీజేపీకి ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను విమర్శించే హక్కు లేదన్నారు.