హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం విఫలమవుతోందని, రానున్న రోజుల్లో దేశంలో కమ్యూనిజానికే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నాగోల్‌లోని గిరిప్రసాద్ భవన్‌లో నిర్వహించిన సూర్యాపేట జిల్లా సమితి సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులకు కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మోదీ పాలనలో దేశం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు.ప్రపంచ ఆకలి సూచీలో 2014లో 55వ స్థానంలో ఉన్న భారత్, 2025నాటికి 102వ స్థానానికి దిగజారిపోయిందని చెప్పారు. 2014లో సుమారు రూ. 53 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పులు, 2025–-26 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఏకంగా రూ. 197 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఈ భారీ అప్పుల భారాన్ని దేశ ప్రజలపై మోపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
