తెలంగాణలో మోడీ పర్యటనను అడ్డుకుంటాం:కూనంనేని సాంబశివరావు

తెలంగాణలో మోడీ పర్యటనను అడ్డుకుంటాం:కూనంనేని సాంబశివరావు

బీజేపీపై  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనెల 12వ తేదీన రామంగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేసేందుకు ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాతనే షెడ్యూల్  ప్రకారమే మోడీ టూర్ ను బీజేపీ ప్లాన్ చేసిందన్నారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీనీ మళ్లీ రీ ఓపెన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 8 ఏండ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.  విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.  తెలంగాణలోని బొగ్గు బావులను బడా పారిశ్రామిక వేత్తలు ఆదానీ,అంబానీకి కేటాయించేందుకే ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ప్రధాని పర్యటనకు నిరసనగా ఈనెల 10వ తేదీ (గురువారం)  ఐదు జిల్లాల్లోని బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.  

తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీని అడ్డుకుంటామని కూనంనేని సాంబశివరావు అన్నారు.  తమిళనాడు, కేరళ,ఢిల్లీ, తెలంగాణ లో గవర్నర్ ల తీరు సరిగా లేదన్నారు. బ్రిటీష్ కాలంలో వచ్చిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తమిళిసై తెలంగాణను వదిలివెళ్లిపోవాలని సూచించారు. గవర్నర్ తీరుకు నిరసనగా త్వరలో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు.