
- కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం
- బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది
- ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి గెలవాలని కామెంట్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆయనను గెలిపించేందుకు కాంగ్రెస్, సీపీఐ సమిష్టిగా కృషి చేస్తాయని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఏర్పడిందని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమిని గెలిపించుకోవాలన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే విజయరమణారావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి చాడ వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పెద్దపల్లి ప్రాంతానికి కాకా వెంకటస్వామి కుటుంబం 40 ఏండ్లుగా సేవ చేస్తోందన్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, మోదీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నదని మండిపడ్డారు . రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న మోదీ సర్కారును ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో నియంతృత్వం కొనసాగిందన్నారు.
మా ఫ్యామిలీ ప్రజా సేవలోనే ఉంది: వివేక్
కాకా వెంకటస్వామి నుంచి గడ్డం వంశీ వరకు తమ కుటుంబం మొత్తం ప్రజా సేవలోనే ఉందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పదవులు ఉన్నా.. లేకపోయినా.. తాను వారానికి రెండు, మూడు రోజులు పెద్దపల్లి పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను కలుస్తూనే ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. కాకా వెంకటస్వామిని పెద్దపల్లి నుంచి 4 సార్లు, తనను ఒక్కసారి ఎంపీగా గెలిపించడంలో సీపీఐ మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. బీజేపీ అభ్యర్థి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.