కమ్యూనిజం ఎక్కడుందనే వారికి..కొత్తగూడెం రిజల్ట్ చెంపపెట్టు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కమ్యూనిజం ఎక్కడుందనే వారికి..కొత్తగూడెం రిజల్ట్ చెంపపెట్టు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్టు పార్టీలను చిన్నచూపు చూసేవారికి, కమ్యూనిజం ఎక్కడున్నదనేవారికి కొత్తగూడెం మేయర్ ఎన్నిక చెంప పెట్టు లాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సవాల్ తీసుకుంటామని,  సర్వశక్తులూ ఒడ్డి గెలుస్తామని చెప్పారు. 

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బలమైన ప్రాతినిధ్యం ఉండేలా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెంలో అనేక ఇబ్బందులు పెట్టినా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్​తో కలిశామని, భవిష్యత్తులో పొత్తు కొనసాగడమా? లేదా? అనేది కాంగ్రెస్ చేతిలోనే ఉందని కూనంనేని వెల్లడించారు. 

కొత్తగూడెం మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో అపూర్వగట్టం ఆవిష్కృతమైందని, మొదటి మేయర్ కమ్యూనిస్టు కావడం, అందులోనూ సాధారణ వ్యక్తి, ఆటోడ్రైవర్ ను మేయర్ చేయడంపై పేద, శ్రామిక, కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్  మేయర్, డిప్యూటీ మేయర్.. మరో ఐదారు ఆఫర్లు ఇచ్చినప్పటికీ తాము జాతీయ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్దుబాటులో ఉన్నామని, జిల్లా విషయం వచ్చే సరికే అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ సీఎం, కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి చొరవతో పొత్తు కుదిరిందన్నారు. 

పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ.. తమకు బీఆర్ ఎస్​ మద్దతు ప్రకటించినా.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ తో ఉన్న అవగాహన మేరకు కాంగ్రెస్ కలిశామన్నారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ మొదటి సారి మేయర్ స్థానాన్ని దక్కించుకున్నదన్నారు.  సమావేశంలో  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, సయ్యద్ అజీజ్ పాషా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.