బీసీల రాష్ట్ర బంద్‌‌కు సీపీఎం, సీపీఐ, టీజేఎస్, టీడీపీ మద్దతు

బీసీల రాష్ట్ర బంద్‌‌కు  సీపీఎం, సీపీఐ, టీజేఎస్, టీడీపీ మద్దతు
  • రిజర్వేషన్లపై కేంద్రం వైఖరిని ప్రకటించాలని డిమాండ్

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌‌ను నిర సిస్తూ ఈ నెల 18న తలపెట్టిన బీసీల రాష్ట్ర బంద్‌‌కు సీపీఎం, సీపీఐ, టీజేఎస్, టీడీపీ మద్దతు ప్రకటించాయి. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, వీజీ నారగోని, రాజారామ్ యాదవ్, గుజ్జ కృష్ణతోపాటు పలు బీసీ సంఘాల నేతలు మంగళవారం ఆయా పార్టీల కీలక నేతలను కలిశారు. ఈ సందర్భంగా  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్‌‌లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చాలని కోరారు.

 బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించి చైతన్య పరిచించింది టీడీపీనే అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డు కోవడం చాలా బాధాకరమన్నారు. కోర్టు తీర్పులను అధిగమించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .18న జరిగే బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటామని కోదండరాం పేర్కొన్నారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం మొండి వైఖరిని వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ నెల15న బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో  జిల్లా, మండల కేంద్రాలలో నిర్వహించనున్న రాస్తారోకో, నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే..బీసీ సంఘాల జేఏసీ 18న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌‌కు సీపీఐ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు.