
హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడకుండా, గ్రామసభలు నిర్వహించకుండా బలవంతంగా భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రతిఘటన తప్పదన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘మొత్తం 8 జిల్లాలు 33 మండలాలు 163 గ్రామాల పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికోసం భూములు తీసుకుంటామని ప్రకటించింది. అలాగే రైల్వే ట్రాక్ కోసం మరో 40 అడుగుల వెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నది.
ఇప్పటికే రెండుసార్లు అలైన్‌మెంట్ మార్చారు. ఇప్పుడు మూడో అలైన్‌మెంట్ ఇచ్చారు. రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్నోళ్ల భూముల్లో నుంచి రోడ్డు వెళ్లకుండా.. చిన్న, సన్నకారు రైతుల భూముల్లో నుంచి వెళ్లేలా అలైన్‌మెంట్ రూపొందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి” అని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యలపై 23న హైదరాబాద్‌లో ఆయా జిల్లాలు, మండలాల పార్టీ బాధ్యులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.