- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజనింగ్ఘటనలు పునరావృతమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. గురుకుల హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. హైదరాబాద్బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల బాలికల హాస్టల్‌లో శుక్రవారం కలుషిత పెరుగు, కుళ్లిన కూరగాయల ఆహారం తిని 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై కింగ్‌కోఠి, నిలోఫర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ మేరకు ఆదివారం కింగ్‌కోఠిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జాన్‌వెస్లీ పరామర్శించి మాట్లాడారు. ఈ ఘటన బయటకు రాకుండా ప్రిన్సిపాల్ ప్రయత్నించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఉప్మారవ్వ, పులిసిన పెరుగు, కుళ్లిన కూరగాయల వల్లనే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నాయని చెప్పారు.
