ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు

ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు

హనుమకొండ సిటీ, వెలుగు: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూచించారు. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్​లోని బాలవికాస సంస్థలో సోమవారం ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశాలు బుధవారం ముగిశాయి. ముగింపు సభలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యలపై పోరాటాలు ఎలా చేయాలో పార్టీ నాయకులకు రాఘవులు దిశానిర్దేశం చేశారు.  అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలు తీర్మానాలను ప్రతిపాదించగా రాష్ట్ర కమిటీసభ్యులు ఆమోదం తెలిపారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసనం చేయాలని, రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమల్లో  కనీస వేతనాల జీవో విడుదల చేయాలని, పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలని, ధరణిలో గుర్తించిన 20 రకాల సమస్యలను తీర్చాలని, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. ఆగస్టు 3న కార్మికులు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, హనుమకొండ జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు సారంపెల్లి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.