ఆరు జోన్లతో గ్రేటర్ హైదరాబాద్... మూడు జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి

ఆరు జోన్లతో గ్రేటర్ హైదరాబాద్... మూడు జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి
  • వచ్చే నెలలోనే మూడు కార్పొరేషన్​లు?
  • ఇందుకు అనుగుణంగానే అధికారుల బదిలీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఏర్పడిన మహా నగరం మరో 38 రోజుల్లో మూడు కార్పొరేషన్లుగా మారబోతోంది. జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతమున్న 12 జోన్లలో ఆరు జోన్లతో హైదరాబాద్​కార్పొరేషన్, మూడు జోన్లతో సైబరాబాద్, మరో మూడు జోన్లతో మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారుల బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ కార్పొరేషన్​150 వార్డులతో ఏర్పడనుండడంతో ఇక్కడ ఉన్నతాధికారులను నియమిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బల్దియాలో కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగానికి చీఫ్​సిటీ ప్లానర్ గా పనిచేసిన శ్రీనివాస్ కు ఆరు జోన్ల బాధ్యతలు అప్పగించారు. అలాగే, మరో ఇద్దరు అధికారులను మూడు జోన్లకి ఒక్కరు చొప్పున టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లుగా నియమించారు.

నేడో, రేపో అడిషనల్ కమిషన్ల బదిలీలు

హెడ్ ఆఫీసులో అడిషనల్​(ఏసీ)కమిషనర్లుగా కొనసాగుతున్న వారిలో ఇప్పటికే ఇద్దరిని బదిలీ చేశారు. అడ్మిన్ ఏసీగా పనిచేస్తున్న వేణుగోపాల్, ఫైనాన్స్ విభాగం ఏసీగా పనిచేసిన గీతారాధిలకు చెరో మూడు జోన్లకు అడ్మిన్ తో పాటు  ఫైనాన్స్ విభాగాలకు జాయింట్ కమిషనర్లుగా నియమించారు. అయితే, కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత వీరు ఆయా కార్పొరేషన్లలో ఆ విభాగాలకు అడిషనల్ కమిషర్లుగా కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక నేడో, రేపో శానిటేషన్, హెల్త్, యూసీడీ, ఎస్టేట్స్ తదితర విభాగాలకు సంబంధించి మూడు జోన్లకి ఒకరిని, మరో మూడు జోన్లకి ఇంకొకరిని జాయింట్ కమిషనర్లను నియమించే అవకాశముంది. 

వీరు కూడా  కార్పొరేషన్లు ఏర్పడిన తరువాత ఏసీలుగా మారనున్నట్టు సమాచారం. ఇప్పుడే ఓ విభాగానికి సంబంధించి ఇద్దరు ఏసీలను నియమించే అవకాశం లేకపోవడంతో జాయింట్ కమిషనర్లుగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కార్పొరేషన్ కి సంబంధించిన ఆరు జోన్లకి అయితే ప్రత్యేకంగా ఎవరినీ నియమించడంలేదు.  ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే ఈ కొత్త కార్పొరేషన్లు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్ కార్పొరేషన్ 

శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశముంది. ఇందులో 30 సర్కిల్స్, 150 వార్డులు ఉండనున్నాయి. ఇది పాత జీహెచ్ఎంసీ మాదిరిగానే కొనసాగనున్నది. ఇందులో వార్డులు, సర్కిల్స్ అప్పటిలాగే ఉంటాయి. కాకపోతే కొన్ని బౌండరీలు మాత్రమే మారుతాయి. ఇక కార్పొరేషన్​కు కమిషనర్ గా ప్రస్తుతం ఉన్న ఆర్వీ కర్ణన్ కొనసాగే అవకాశముంది. 

సైబరాబాద్..

గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ లో  శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండనున్నాయి.  ఇందులో 16 సర్కిల్స్ 76 వార్డులు ఉంటాయని సమాచారం. ఈ కార్పొరేషన్ కి కమిషనర్ గా ఈ జోన్లకి సంబంధించి అడిషనల్ కమిషనర్​గా మానిటరింగ్ చేస్తున్న ఐఏఎస్​ అధికారి సృజనను నియమించే అవకాశముంది. 

మల్కాజిగిరి..

మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్  జోన్లతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడనున్నట్లు తెలిసింది. ఇందులో 14 సర్కిల్స్ ఉండగా వీటి కింద 74 వార్డులు ఉండనున్నాయి. ఈ కార్పొరేషన్​కు కమిషనర్ గా ఈ జోన్లకి  అడిషనల్ కమిషనర్​గా మానిటరింగ్ చేస్తున్న ఐఏఎస్​ఆఫీసర్​వినయ్ కృష్ణారెడ్డిని నియమించే అవకాశముంది.