భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి దీపికా పదుకొణె. ఈ ముద్దుగుమ్మ ఈ రోజు( జనవరి 5, 2026 ) తన 40 పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఒక ఆసక్తికరమైన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
సమురాయ్ వారియర్‌గా దీపికా.. అసలేం జరిగింది?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'AA22xA6'. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా సన్ నెట్‌వర్క్‌కు చెందిన 'సన్ మ్యూజిక్' తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దీపికాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో దీపికా ఒక శక్తివంతమైన సమురాయ్ వారియర్ గెటప్‌లో కనిపించడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సన్ మ్యూజిక్ ఆ ఫోటోను డిలీట్ చేసింది. దీంతో ఇది సినిమాలోని ఆమె అఫీషియల్ లుక్కా? లేక పొరపాటున ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను షేర్ చేశారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ పోస్టర్ పై నెట్టింట వైరల్అవుతూ తీవ్ర చర్చ తెరలేపింది..
నెటిజన్ల రియాక్షన్..
సన్ మ్యూజిక్ పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒకవేళ సన్ పిక్చర్స్ అఫీషియల్ హ్యాండిల్ నుండి వచ్చి ఉంటే నమ్మేవాళ్లం, సన్ మ్యూజిక్ అంటే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే దీపికా పాత సినిమా 'చాందినీ చౌక్ టు చైనా' వైబ్స్ వస్తున్నాయి అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆతర్వాత సన్ పిక్చర్స్ దీపికాకు పుట్టినరోజు శుభకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ మే 2025లో మేరీ క్లైర్ తో ఆమె చేసిన షూట్ నుండి వచ్చినందని అభిమానులు గుర్తించారు.
భారీ అంచనాల మధ్య 'AA22xA6'
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 2025లోనే దీపికా ఎంట్రీని ఒక టీజర్ ద్వారా ఖరారు చేసింది. "ది క్వీన్ మార్చెస్ టు కాంకర్!" అంటూ అప్పట్లో వదిలిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అల్లు అర్జున్, అట్లీ, దీపికా పదుకొణె.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో గ్లోబల్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ నెలకొంది. అభిమానులు, సినీ వర్గాల అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే 'AA22xA6' నుంచి దీపికా పోస్టర్ రిలీజ్ కాకపోవడంతో అభిమానులు కాస్తంత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
దీపికా చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు
దీపికా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమానే కాకుండా ఆమె ఖాతాలో మరికొన్ని భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్‌తో కలిసి కింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ వంటి భారీ తారాగణం కూడా కీలక పాత్రలో నటిస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్, అదే ఎనర్జీతో దూసుకుపోతున్న దీపికా పదుకొణెకు ఈ ఏడాది కెరీర్ పరంగా చాలా కీలకం. మరి 'AA22xA6' నుంచి లీక్ అయిన ఆ వారియర్ లుక్ నిజమేనా కాదా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే!–
Wishing the super talented @deepikapadukone a very happy birthday! #HBDDeepikaPadukone #HappyBirthdayDeepikaPadukone pic.twitter.com/nTWW9AygS8
— Sun Pictures (@sunpictures) January 5, 2026
