మాటిస్తున్నా.. 2026లో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తది: అమిత్ షా

మాటిస్తున్నా.. 2026లో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తది: అమిత్ షా

చెన్నై: 2026లో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా జోస్యం చెప్పారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం (జనవరి 4) అమిత్ షా తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుచిరాపల్లిలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అధికార డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్‎పై విరుచుకుపడ్డారు. డీఎంకే సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అభివర్ణించారు. సీఎం స్టాలిన్ ప్రజల సంక్షేమం కంటే వారసత్వ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం కంటే ఉదయనిధి స్టాలిన్‌ను తదుపరి సీఎం చేయడంపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. 

►ALSO READ | సినిమా తరహా ఘటన: పెళ్లి వేడుకలో సర్పంచ్‎ను కాల్చి చంపిన దుండగులు

తమిళనాడులో కుటుంబ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని.. మొదట కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి ముఖ్యమంత్రి కావాలనే ఈ కల నెరవేరదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. 

2026 ఏప్రిల్‌లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుందని బీజేపీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నానని అన్నారు. కాగా, 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో అందని దాక్షగా మిగిలిన విజయాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికలకు మరో నాలుగైదు నెలల ముందే నుంచే అధికారమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది కమలం పార్టీ.