సినిమా తరహా ఘటన: పెళ్లి వేడుకలో సర్పంచ్‎ను కాల్చి చంపిన దుండగులు

సినిమా తరహా ఘటన: పెళ్లి వేడుకలో సర్పంచ్‎ను కాల్చి చంపిన దుండగులు

చండీఘర్: పెళ్లి వేడుకలో ఓ సర్పంచ్‎ను కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం (జనవరి 4) అమృత్‌సర్‌లోని మేరీగోల్డ్ రిసార్ట్‌లో ఓ వివాహ కార్యక్రమం జరిగింది. తర్న్ తరణ్ జిల్లాకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్పంచ్ జర్మల్ సింగ్‌ వధుపు తరుఫున ఈ వేడుకకు  హాజరయ్యాడు. 

ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పెళ్లి వేడుకలోకి చొరబడి జర్మల్ సింగ్‌‎పై కాల్పులు జరిపి పారిపోయారు. తలకు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డ జర్మల్ సింగ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ ఘటనతో అప్పటి వరకు బాజా భజంత్రీలు, బంధువుల కోలాహాలంతో సందడిగా ఉన్న పెళ్లి వేడుకలో విషాదం అలుముకుంది.

ఈ ఘటనపై తర్న్ తరణ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగ్జిత్ వాలియా మాట్లాడుతూ.. పెళ్లి కార్యక్రమం జరుగుతుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు పెళ్లి వేడుకలోకి ప్రవేశించి జర్మల్ సింగ్‎పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా రెండు, మాడు సార్లు జర్మల్ సింగ్‎పై దాడి జరిగిందని పేర్కొన్నారు.