ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : బీవీ రాఘవులు

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : బీవీ రాఘవులు
  • దీనికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం: బీవీ రాఘవులు
  • ఏచూరి ప్రథమ వర్ధంతి సభలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడి వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. భూస్వామ్య, రాచరిక వ్యవస్థలు రావాలని బీజేపీ కోరుకుంటున్నదని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభను రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సోషలిస్టు ఆచరణ పథం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. ‘‘బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. వామపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలి’’అని రాఘవులు అన్నారు. విద్యార్థి దశ నుంచే ఏచూరితో తనకు అనుబంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. 

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాలను తీసేయాలని కొందరు మాట్లాడటాన్ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పాలన, విద్య, రాజకీయాల్లో మతం జోక్యం ఏంటని ప్రశ్నించారు. కార్మికులను, రైతులను ఒక్కటి చేసి జాతీయోద్యమంలో పాల్గొనేలా చేయడంలో కమ్యూనిస్టులది కీలక పాత్ర అని సీపీఐ (ఎంఎల్)- ప్రజాపంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారావు పేర్కొన్నారు.