కనీస వేతన జీవోను సవరించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

కనీస వేతన జీవోను సవరించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన కనీస వేతన జీవో 60ని సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, లేబర్​ కమిషనర్​కు శనివారం ఆయన లేఖ రాశారు. షాహి ఎక్స్​పోర్ట్‌ మహిళా కార్మికులకు కనీసం రూ.16 వేలు అందేలా చూడాలని కోరారు. 

హైదరాబాద్​లోని నాచారం పారిశ్రామిక వాడలోని  షాహిఎక్స్​పోర్ట్‌ పరిశ్రమలో దాదాపు 2 వేల మందికి పైగా మహిళా కార్మికులు  పనిచేస్తున్నారని తెలిపారు. 20 ఏండ్లుగా ఈ పరిశ్రమ నడుస్తున్నప్పటికీ, కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. 

 వీరికి  రూ.26 వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా.. నెలకు రూ.11,230 మాత్రమే గ్రాస్‌ జీతం ఇస్తున్నారని, ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్‌  ఇవ్వలేదని పేర్కొన్నారు. కనీసం రూ.16 వేలు ఇవ్వాలని కోరుతూ 6 రోజులుగా కంపెనీ గేటు ముందే తీవ్రమైన చలిలో కూడా మహిళా కార్మికులు సమ్మె చేస్తున్నారని వెల్లడించారు. తక్షణమే ఆ కార్మికులకు కనీసం రూ.16 వేల వేతనం అమలయ్యేలా చూడాలని కోరారు.