సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. నవంబర్17 లోపు తేల్చకపోతే సామూహిక సెలవులు, దీక్షలు: ఎంప్లాయిస్ యూనియన్ 

సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. నవంబర్17 లోపు తేల్చకపోతే సామూహిక సెలవులు, దీక్షలు: ఎంప్లాయిస్ యూనియన్ 
  • పాత పెన్షన్​ స్కీమ్​ను అమలు చేయాలి: సీపీఎస్​ఈయూ
  • ఆ హామీ మేరకే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించినం.. ఓపీఎస్ ఇస్తే మళ్లీ ఓటెస్తం
  • నవంబర్17 లోపు తేల్చకపోతే సామూహిక సెలవులు, దీక్షలు
  • ఎల్బీ స్టేడియంలో ‘చలో హైదరాబాద్ - జనజాగరణ సభ’

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్​ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని కోరారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌‌‌‌‌‌‌‌తో ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎల్బీ స్టేడియంలో సీపీఎస్‌‌‌‌‌‌‌‌ఈయూ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్ - జనజాగరణ సభ’ నిర్వహించారు. 

ఈ సభకు అధ్యక్షత వహించిన స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యోగుల బాధలు చూసి ఓపీఎస్‌‌‌‌‌‌‌‌పై రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందుకే నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పారు. ఇప్పుడు నిర్ణయాధికారం సీఎం చేతుల్లోనే ఉందని, పాత పెన్షన్ ఇస్తే మళ్లీ ఆయననే గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. 

ఒకవేళ ఓపీఎస్‌‌‌‌పై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం.. కాంగ్రెస్ మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది అంతా మూకుమ్మడి సెలవులు (మాస్ లీవ్) పెట్టి జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలకు దిగుతామని  ప్రభుత్వాన్ని స్థితప్రజ్ఞ హెచ్చరించారు. గత 22 ఏండ్లుగా సీపీఎస్ విధానంతో రాష్ట్రంలోని 2.6 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, సామాజిక భద్రత కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత 12 ఏండ్లుగా చేసిన పోరాటాలతోనే సీపీఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ గ్రాట్యుటీ సాధించుకున్నామని తెలిపారు. 

రూ.1,800 కోట్లు ఆవిరైనయ్ 

జులై 11న మొదలైన జనజాగరణ యాత్ర రెండు దశల్లో 33 జిల్లాల్లో, 119 నియోజకవర్గాల్లో తిరిగిందని, ప్రజా ప్రతినిధులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టోను గుర్తుచేస్తూ వినతిపత్రాలు ఇచ్చామని స్థితప్రజ్ఞ చెప్పారు. ఆ యాత్ర ముగింపు సభే ఈ ‘చలో హైదరాబాద్’ అని వెల్లడించారు.  ఎక్కడో యుద్ధం జరిగితే, తెలంగాణలో సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ అకౌంట్లలోని ఉద్యోగుల, ప్రభుత్వ సొమ్ము సుమారు రూ.1,800 కోట్లు ఒక్క నెలలోనే ఆవిరయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో 5 వేల మందికిపైగా సీపీఎస్ ఉద్యోగులు రిటైర్ అయితే.. ఏ ఒక్కరికీ కనీసం రూ.5 వేల పెన్షన్ కూడా రావడం లేదని చెప్పారు. రాజస్థాన్, చత్తీస్‌‌‌‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసినట్టే.. మన దగ్గర కూడా ఓపీఎస్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

సీపీఎస్​ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శ్రీకాంత్ మాట్లాడుతూ.. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే, ఆఖరుకు తమ పెన్షన్ నిధులను కార్పొరేట్ షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం ఏమాత్రం న్యాయం కాదన్నారు. పోరాటంతోనే డెత్ కమ్ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ గ్రాట్యుటీ, 2021లో జీవో 58 ద్వారా ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి 50% పెన్షన్ అందేలా ప్రకటింపజేసిన ఘనత తమ సంఘానిదేనని స్పష్టం చేశారు.  
స్క్రీన్ల ద్వారా నేతల పాత ప్రసంగాలు.. 

సభా ప్రాంగణంలోని భారీ స్క్రీన్లపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, భట్టి విక్రమార్క, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓపీఎస్ పునరుద్ధరణపై ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు. ఇదే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు, ప్రమోషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి... ఇక్కడే పాత పెన్షన్ ప్రకటన చేయాలని నినాదాలతో స్టేడియం హోరెత్తింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నరేశ్‌‌‌‌ గౌడ్, ఉపాధ్యక్షులు మ్యాన పవన్, కూరకుల శ్రీనివాస్, చింతల రాకేశ్‌‌‌‌ భవాని, మల్లికార్జున్, పోల శ్రీనివాస్, కిరణ్, లింగమూర్తి, నరేందర్ రావు, శ్యామ్ సుందర్, బుచ్చన్నతోపాటు అన్ని జిల్లాల నేతలు, భారీ సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు. కాగా, కుండపోత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా.. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు, దివ్యాంగులతో పాటు వీరికి మద్దతుగా పాత పెన్షన్ దారులు కూడా హాజరై సంఘీభావం తెలిపారు.