- ప్రభుత్వానికి సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగులకు ఫింఛన్ ఇవ్వలేనప్పుడు హెల్త్ స్కీం కింద డబ్బులు ఎలా కట్ చేస్తారని ప్రభుత్వాన్ని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రశ్నించారు. ఓల్డ్ పెన్షన్ స్కీం వాళ్లకు ప్రభుత్వమే పెన్షన్ ఇస్తుంది కాబట్టి.. అందులో హెల్త్ స్కీం కోసం 1.5 శాతం కట్ చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కానీ, సీపీఎస్ వాళ్లకు షేర్ మార్కెట్ ఆధారంగా ప్రైవేట్ ఏజెన్సీల నుంచి పెన్షన్ వస్తుందని, అలాంటప్పుడు ప్రభుత్వం తమ పెన్షన్ నుంచి డబ్బులు కట్ట చేయడం సాంకేతికంగా అసాధ్యమన్నారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్లో సీఎస్ రామకృష్ణారావును సీపీఎస్ఈయూ ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందించారు.
అనంతరం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంలో రిటైర్ అయిన ఉద్యోగులకు వచ్చేది అరకొర పెన్షన్ మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ప్రీమియం కట్టలేకపోతున్నారని చెప్పారు. సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వమే ‘ఉచిత ఆరోగ్య బీమా’ కల్పించాలని డిమాండ్ చేశారు.
