క్రికెట్ బెట్టింగ్ కేసు: ఉన్నతాధికారుల్లో భయం

క్రికెట్ బెట్టింగ్ కేసు: ఉన్నతాధికారుల్లో భయం

కామారెడ్డి జిల్లాలో IPL  క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే బెట్టింగ్ లో అరెస్టైన ఓ వ్యక్తికి బెయిల్ ఇప్పించడం కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన కామారెడ్డి CI జగదీష్ ను ACB  అధికారులు అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముడుపులు ముట్టజెప్పేందుకు మధ్యవర్తిగా ఉన్న సుజయ్ అనే ప్రైవేట్ వ్యక్తి తో ఎవరెవరికి ఎంత మేర మామూళ్లు అందాయనే విషయంలో ఏసీబీ అధికారులు ఓ అంచనాకు వచ్చారు.

ఈ వ్యవహారంలో పలువురు ఎస్సైలు, సిబ్బందితో పాటు డీఎస్పీ పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సీఐ జగదీష్ చెప్పినట్లు సమాచారం. దీంతో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆఫీసులో ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి కామరెడ్డికి వచ్చిన డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు మామూళ్లు తీసుకున్న వ్యవహారంలో పాత్రదారులుగా ఉన్న ఎస్సైలలో ఒకరు సెలవుపై వెళ్లగా మరొక ఎస్సై పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీఐ జగదీష్ ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో రెండు లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.