
మహారాష్ట్రలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఓ బడా వ్యాపారవేత్తను చీట్ చేశాడో క్రికెట్ బుకీ బెట్టింగ్ యాప్లో పెట్టుబడులు పెడతానంటూ వ్యాపారవెత్త నుంచి ఏకంగా రూ. 58 కోట్లకు పైగా కొట్టేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఎవరా వ్యాపారవేత్త..
మహారాష్ట్రలోని గోండియాకు చెందిన క్రికెట్ బుకీ అనంత్నవరతన్ జైన్ ను వ్యాపారవేత్త 2021లో కలిశాడు. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని బుకీ..వ్యాపారవేత్తను నమ్మించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్‌లతో సహా వివిధ గేమింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టించాడు. తర్వాత ఎక్కువ మొత్తంలో వ్యాపారవేత్త బుకీకి డబ్బులు పంపించడంతో నిందితుడు ఎస్కేప్ అయ్యాడు. మొత్తంగా రూ. 58 కోట్లతో ఉడాయించాడు.
నోట్ల కట్టలు..
మోసపోయానని గ్రహించిన వ్యాపారవేత్త... పోలీసులను ఆశ్రయించాడు. క్రికెట్ బుకీ అనంత్నవరతన్ జైన్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నాగ్‌పూర్‌లోని కాకా చౌక్‌లో ఉన్న క్రికెట్ బుకీ ఇంటిపై రైడ్ చేశారు. క్రికెట్ బుకీ ఇంట్లో కోట్లకు కోట్లు డబ్బులు ఉండటంపై పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుడి ఇంటి నుంచి పోలీసులు రూ. 17 కోట్లకు పైగా నగదు, 4 కిలోల బంగారం, 200 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఇంట్లో పట్టుబడిన డబ్బును పోలీసులు టెల్లర్ మిషన్‌ల సాయంతో లెక్కించడం గమనార్హం. అయితే పోలీసులు అతని నివాసంపై దాడి చేసేలోపే క్రికెట్ బుకీ అనంత్ నవరతన్ జైన్ పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.