
న్యూఢిల్లీ: జపాన్ ఆతిథ్యం ఇచ్చే 2026 ఆసియా గేమ్స్ లోనూ క్రికెట్ కొనసాగుతుందని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఓసీఏ, గేమ్స్ నిర్వాహక కమిటీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచీ నగోయాలో ఈ గేమ్స్ జరగనున్నాయి. ‘ఏప్రిల్ 28న ఓసీఏ, నిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఇందులో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ క్రికెట్‌తో పాటు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉండాలని కోరడంతో ఆమోదముద్ర లభించింది’ అని ఓసీఏ పేర్కొంది.
టీ20 ఫార్మాట్‌లో జరిగే పోటీలకు వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. ఆసియా గేమ్స్‌లో ఆడే 41 ఆటల్లో క్రికెట్ కూడా భాగంగా ఉండనుంది. 45 దేశాల నుంచి 15 వేల మంది అథ్లెట్లు, అఫీషియల్స్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. గ్వాంగ్‌జౌ (2010), ఇంచియాన్ (2014), హాంగ్‌జౌ (2023) గేమ్స్‌లో క్రికెట్ నిర్వహించారు.
ఇందులో ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్నాయి. నాగోయా పోర్టులో డాక్ చేసిన ‘ఫ్లోటింగ్ అథ్లెట్స్ విలేజ్’ క్రూయిజ్ షిప్‌లో 4600 మందికి వసతి కల్పిస్తామని ఓసీఏ వెల్లడించింది. ఆర్చరీ, బాస్కెట్‌బాల్ 3X3, కనోయ్ / కయాక్(స్ప్రింట్), సైక్లింగ్ మౌంటెన్ బైక్, సైక్లింగ్ బీఎంఎక్స్ రేసింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, కురాష్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రగ్బీ, సెపక్‌తక్రా, స్పోర్ట్ క్లైంబింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషుకు చెందిన అథ్లెట్లు ఇందులో ఉంటారు. క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ప్లేయర్లకు హోటల్‌లో వసతి కల్పించనున్నారు.