
- ఇద్దరి టార్గెట్ సెమీస్ బెర్తే..
- టీమిండియాలో మార్పులు
- భువనేశ్వర్ , జడేజాలో చోటెవరికీ?
- ఒత్తిడిలో బంగ్లాదేశ్
ఒకే ఒక్క ఓటమితో బయటపడ్డ టీమిండియా బలహీనతలపై బంగ్లా దెబ్బకొడుతుందా? సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టైగర్లు పంజా విసురుతారా? సౌతాఫ్రికా, వెస్టిండీస్‌పై చెలరేగినట్లుగా విరాట్‌సేనకు చెక్ పెడతారా? ఈ నేపథ్యంలో ఎలాంటి సమీకరణాలు అక్కర్లేకుండా ఇక్కడే నాకౌట్ బెర్త్‌ను సాధించాలనుకుంటున్న ఇండియా.. ‘బంగ్లా టెస్ట్’కు రెడీ అయ్యింది. మొన్నటి వరకు జోరుమీద కనిపించిన టీమిండియా ప్రస్తుతం ఆత్మవిశ్వాసలేమితో కనిపిస్తున్నా.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గానే దిగుతున్నది. మరోవైపు సంచలనంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన బంగ్లా.. సమష్టిగా చెలరేగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
బర్మింగ్‌హామ్: వరల్డ్‌కప్‌లో తొలి ఓటమి చవిచూసిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో సంచలనాల బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న విరాట్‌సేనకు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో ఓడినా సెమీస్ బెర్త్‌కు వచ్చిన ప్రమాదమేమి లేకపోయినా.. ఆత్మవిశ్వాసంతో నాకౌట్‌ను మొదలుపెట్టాలంటే కచ్చితంగా ఇందులో నెగ్గాలి. గాయాలు, మిడిలార్డర్ వైఫల్యం కారణంగా మేనేజ్‌మెంట్‌తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నది. దీంతో ఫైనల్ ఎలెవన్‌లో ఎవరు ఉంటారనే దానిపై ఆతృత, ఆసక్తి మొదలైనా.. పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో బంగ్లా కచ్చితంగా గెలిచి తీరాలి. దీంతో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతున్న మోర్తజా బృందం సంచలనం చేయాలని ఆరాటపడుతున్నది.
రేస్‌లో భువీ, జడేజా
ఇంగ్లండ్‌పై ఓటమి తర్వాత తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫ్లాట్ వికెట్‌పై మణికట్టు స్పిన్నర్లు తేలిపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై టీమిండియా మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది. దీంతో భువనేశ్వర్, జడేజా ఫైనల్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత కోలుకోవడానికి ఇండియాకు పెద్దగా సమయం లేకపోవడం కూడా ప్రతికూలాంశంగా మారింది. ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు ముగిసినా.. మిడిలార్డర్ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ సారథి ధోనీ, కేదార్ వైఫల్యం జట్టును వెంటాడుతున్నది. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నా.. వీరిద్దరు ఇంగ్లండ్‌పై చివరి ఐదు ఓవర్లలో 39 రన్స్ మాత్రమే చేయడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో జాదవ్‌ను తప్పించి జడేజాకు అవకాశం ఇస్తే బాగుంటుంది. జాదవ్‌తో పోలిస్తే జడేజా బిగ్ హిట్టర్. 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. లెఫ్టార్మ్ స్పిన్‌తో పరుగులు కట్టడి చేయడంలో నేర్పరి. గ్రౌండ్‌లో ఏ పొజిషన్‌లోనైనా ఫీల్డింగ్ చేస్తాడు. ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్ డైమెన్షన్స్‌ను దృష్టిలో పెట్టుకున్నా జడ్డూ అవసరం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఓ వైపు బౌండరీ లైన్ 60 మీటర్ల కంటే తక్కువగా ఉండటంతో రిస్ట్ స్పిన్నర్ కంటే లెఫ్టార్మర్ రన్స్ బాగా నిరోధిస్తాడు. ఈ ఫార్ములాను అనుసరిస్తే చహల్, కుల్దీప్‌లో ఒకరికే చోటు దక్కుతుంది. తమీమ్, షకీబల్, ముష్ఫికర్, లిటన్ దాస్, మహ్మదుల్లా లాంటి హిట్టర్లున్నా బంగ్లాపై ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఆడించడం కూడా పెద్ద రిస్కే. కాబట్టి చహల్‌ను తప్పించి భువనేశ్వర్‌ను తీసుకుంటే ముగ్గురు ఫ్రంట్‌లైన్ పేసర్లతో ఆడొచ్చు. భువీని తీసుకోవడం వల్ల లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. టాప్–3లో రోహిత్, కోహ్లీ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నా.. రాహుల్ గాడిలో పడాలి. నాలుగో స్థానంలో రిషబ్‌ను దించితే పరుగుల వరద ఖాయం.
మోర్తజాతో పరేశాన్
ఇండియాతో మ్యాచ్ అంటే బంగ్లా కాస్త ఎక్కువగానే శ్రమిస్తుంది. అయితే సెమీస్‌కు చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలువాలి. కాబట్టి వాళ్లపై అధిక ఒత్తిడి ఉంటుంది. దీనిని అధిగమించడం కత్తిమీద సామే. దీనికితోడు బంగ్లా.. షకీబల్ (476 రన్స్, 10 వికెట్లు) ఆల్‌రౌండ్ ఫెర్ఫామెన్స్‌పై ఎక్కువగా ఆధారపడటం బంగ్లాకు అతిపెద్ద ప్రతికూలాంశంగా మారింది. ప్రస్తుతం బంగ్లా బౌలింగ్ చాలా వీక్‌గా కనిపిస్తున్నది. కెప్టెన్ మోర్తజా వైఫల్యం పెద్ద సమస్యగా మారింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన అతను ఒక్క వికెటే తీశాడు. కెప్టెన్ కాకపోతే ఈపాటికి తుది జట్టులో చోటు గల్లంతయ్యేది. ముస్తాఫిజుర్ కొద్దొగొప్పో ఫర్వాలేదనిపిస్తున్నా.. సైఫుద్దీన్ సత్తా చాటాల్సిన అవసరం చాలా ఉంది. మెహిదీ హసన్ స్పిన్ మ్యాజిక్ కూడా పని చేయడం లేదు. బ్యాటింగ్‌లో తమీమ్, సౌమ్య, షకీబల్, ముష్ఫికర్, లిటన్ దాస్, మహ్మదుల్లా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మొత్తానికి సౌతాఫ్రికా, వెస్టిండీస్‌పై గెలుపుతో సంచలనాలు చేసిన బంగ్లా.. ఆ స్థాయి ఫెర్ఫామెన్స్‌ను ఇండియాపై చూపెట్టాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్ ), రోహిత్ ,రాహుల్ , రిషబ్ , ధోనీ, కేదార్ , హార్దిక్ ,భువనేశ్వర్ , కుల్దీప్ / చహల్ , షమీ, బుమ్రా.
బంగ్లాదేశ్ : మోర్తజా (కెప్టెన్ ), తమీమ్ ,సౌమ్య, షకీబల్ , ముష్ఫికర్ , లిటన్ దాస్ ,మహ్మదుల్లా, మొసాద్దెక్ , మెహిదీ హసన్ ,సైఫుద్దీన్ , ముస్తాఫిజుర్ .
పిచ్ , వాతావరణం
ఇండియా–ఇంగ్లండ్ మ్యాచ్ కు వాడిన పిచ్ నే మళ్లీ వాడుతున్నారు . కాబట్టి ఫ్లాట్ వికెట్ గానే పరిగణించొచ్చు. మ్యాచ్ జరిగేకొద్ది నెమ్మదిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ కు అనుకూలం. స్క్వేర్ బౌండ్రీ లైన్ కావడం షార్ట్‌గా ఉంటుంది. వర్షం ముప్పులేదు.