Sandeep Lamichhane: అత్యాచారం కేసులో దోషిగా తేలిన క్రికెటర్.. 8 ఏళ్ల జైలు శిక్ష

Sandeep Lamichhane: అత్యాచారం కేసులో దోషిగా తేలిన క్రికెటర్.. 8 ఏళ్ల జైలు శిక్ష

యువతిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేకు ఖాట్మండు జిల్లా కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. 300,000 జరిమానా, బాధితురాలికి రూ. 200,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఆగస్ట్ 21, 2022న తిల్‌గంగాలోని ఒక హోటల్‌లో సందీప్ లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు గుషాలా(26) అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. ఇంటర్ పోల్ సాయంతో అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిలుపై విడుదలయ్యాడు. ఈ కేసులో మొదట బాధితురాలు తాను మైనర్‌నని ఆరోపించినప్పటికీ.. న్యాయస్థానం మైనర్ కాదని తెలిపింది.  గత డిసెంబరులో అతన్ని దోషిగా తేల్చిన ఖాట్మండు డిస్ట్రిక్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.  

ఖాట్మండు జిల్లా ప్రభుత్వ న్యాయవాది కార్యాలయం ప్రకటన ప్రకారం.. 2017 జాతీయ శిక్షాస్మృతి చట్టం సెక్షన్ 219లోని సబ్-సెక్షన్ 3 (డి) ప్రకారం లామిచానే అత్యాచారానికి పాల్పడినట్లు తేలడంతో అతనికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు తెలిపింది. ఇప్పటికే  లామిచానే పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ చేయబడినట్లు వెల్లడించింది. 

ఐపీఎల్‌‌లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ 

లెగ్‌స్పిన్నర్‌ అయిన సందీప్‌ లామిచానే ఆనతీకాలంలోనే స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగుల్లో పాల్గొన్నాడు.  ఈ క్రమంలో 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున లామిచానే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తం 51 వన్డేలు ఆడిన లామిచానే 112 వికెట్లు, 52 టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు.