
పంజాగుట్ట, వెలుగు: కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై హనుమకొండకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు బత్తిన శ్రీనివాసరావు అక్కడి పోలీసులకు ఈ నెల 28న ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలతో సీఎం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని, కేటీఆర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం బీజేపీలో చేరతారని సీఎం స్థాయిని తగ్గించే విధంగా కేటీఆర్ మాట్లాడారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఆయన ఫిర్యాదుతో హనుమకొండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌పై శుక్రవారం ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ నోటీసులు
హైదరాబాద్, వెలుగు: మీడియా ముసుగులో కొన్ని సంస్థలు తనపై, తన ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు, కట్టు కథలను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్అన్నారు. సంబంధం లేని అంశాల్లో తమ పేరు, ఫొటోలను వాడుతూ థంబ్ నెయిల్స్ పెడుతున్నారన్నారు. దీనిపై కొన్ని సంస్థలకు లీగల్ నోటీసులు పంపామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను వెంటనే తీసేయాలన్నారు. యూట్యూబ్చానళ్లతో పాటు యూట్యూబ్ సంస్థకు కూడా లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ పేర్కొన్నారు.