గాంధీలో క్లిష్టమైన సర్జరీ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను కాపాడిన డాక్టర్లు

గాంధీలో క్లిష్టమైన సర్జరీ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను కాపాడిన డాక్టర్లు

పద్మారావునగర్‌, వెలుగు: సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు మరో అరుదైన ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు క్లిష్టమైన సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. వారాసిగూడకు చెందిన జాహెదా బేగం(41) కడుపు నొప్పితో దవాఖానకు రాగా, పరీక్షల్లో కుడి కిడ్నీలో భారీ కణితి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 

సీఈసీటీ, ఎంఆర్‌ఐ, డాప్లర్ పరీక్షల్లో ఆ కణితి ప్రధాన రక్తనాళమైన ఐవీసీ వరకు వ్యాపించినట్లు తేలడంతో అడ్వాన్స్‌డ్ స్టేజ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. యూరాలజీ విభాగం నేతృత్వంలో వైద్య బృందం శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ ప్రభావిత కుడి కిడ్నీతో పాటు ఐవీసీలోని కణితిని తొలగించి రక్తనాళాన్ని పునరుద్ధరించింది. ఈ నెల 8న ఆపరేషన్ నిర్వహించగా, ఆరోగ్యం మెరుగుపడడంతో శుక్రవారం రోగిని డిశ్చార్జ్ చేసినట్లు యూరాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ జి.రవిచందర్ 
తెలిపారు.