వన్యప్రాణుల చెంతనే విందులు, వినోదాలు

వన్యప్రాణుల చెంతనే విందులు, వినోదాలు
  • హరిణి నేషనల్ పార్కులో రిసార్ట్ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు
  • లైటింగ్​, సౌండ్స్​తో ఇబ్బందిపడ్తున్న వన్యప్రాణులు 
  • గత బీఆర్​ఎస్​ హయాంలో నెలకు రూ.19 వేలకే లీజుకు
  • పదేండ్లలో తొమ్మిదేండ్లకు పైసా అద్దె కట్టలే
  • ఇటీవల మంత్రి సురేఖ తనిఖీలతో బట్టబయలు
  • రిసార్ట్​ను స్వాధీనం చేసుకోవాలని టీజీఎఫ్​డీసీకి అటవీ శాఖ ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​హయత్​నగర్​సమీపంలోని ‘మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్’ లో  రిసార్ట్ పేరుతో వాణిజ్య కార్యకలపాలు నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాత్రీపగలు తేడాలేకుండా వస్తున్న సౌండ్​, లైటింగ్​ పొల్యూషన్​తో వన్యప్రాణులు ఇబ్బందిపడ్తున్నా ఫారెస్ట్​ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.  సుమారు 3,600 నుంచి 3,800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు ప్రధానంగా కృష్ణ జింకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏకంగా 400 దాకా కృష్ణ జింకలు, 350 కి పైగా మచ్చల జింకలు ఉన్నాయి. ఇవి గాక పెద్దసంఖ్యలో అడవి పందులు, నక్కలు, కుందేళ్లు, పునుగు పిల్లులున్నాయి. నెమళ్లు, బాతులు, కింగ్​ఫిషర్లు, తదితర 120 కి పైగా పక్షి జాతులు,  వివిధ రకాల సరీసృపాలు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి.

ఎఫ్​డీసీ ఆధ్వర్యంలో అనన్య ఎకో రిసార్ట్

జింకలతో  నిండిన ఈ ఎకో సెన్సిటివ్​ జోన్​లో ఫారెస్ట్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​(ఎఫ్​డీసీ) ఆధ్వర్యంలో  ‘అనన్య ఎకో రిసార్ట్​’ను 7 ఎకరాల విస్తీర్ణంలో  ఏర్పాటు చేశారు. సుమారు 10 కాటేజీలు, హోటల్​, రెస్టారెంట్, స్విమ్మింగ్​ఫూల్, ఇండోర్, అవుట్‌‌డోర్ గేమ్స్, ప్లే ఏరియాతోపాటు 30 నుంచి 2 వేల మందికి సరిపడా  బ్యాంక్వెట్ హాల్స్​ నిర్మించారు. వీకెండ్​లో ఫ్యామిలీస్​, ఫ్రెండ్స్​తో సరదాగా గడపడానికి,  వెడ్డింగ్ ఈవెంట్లు, బర్త్​ డే, ఇతర పార్టీలకు వీటిని అద్దెకిస్తున్నారు.  గత బీఆర్ఎస్​హయాంలో  కేవలం నెలకు రూ.19 వేల చొప్పున  ఈ రిసార్ట్స్​ను ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజ్​కు ఇచ్చారు. 

ఒక్క ఏడాది మాత్రమే లీజ్ చెల్లింపు​

అనన్య ఎకో రిసార్ట్ గడిచిన పదేండ్లలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే లీజ్​చెల్లించింది. విషయం కాస్తా మంత్రి కొండా సురేఖ దృష్టికి రావడంతో ఇటీవల ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, పలు అక్రమాలు బయటపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రిసార్ట్​ను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడం, రాత్రీపగలు తేడాలేకుండా సౌండ్​, లైటింగ్​ పొల్యూషన్​తో వన్యప్రాణులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మంత్రి గుర్తించారు.  

అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కనీసం మట్టి రోడ్డు వేయాలన్నా, కరెంటు లైన్​లాగాలన్నా అటవీశాఖ అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతారు. కానీ వన్యప్రాణులకు ఇంత ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కోర్ ఏరియాలో రిసార్ట్స్​ నిర్మించి, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడంపై మంత్రి సీరియస్​కావడంతో తాజాగా అటవీశాఖ రంగంలోకి దిగింది. ఈ రిసార్ట్​ను ప్రైవేట్​ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవాలంటూ టీజీఎఫ్​డీసీకి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్​ పడ్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.