బై ఎలక్షన్ నిర్వహణలో సీఈఓ, ఆఫీసర్ల తీరుపై విమర్శల వెల్లువ 

బై ఎలక్షన్ నిర్వహణలో సీఈఓ, ఆఫీసర్ల తీరుపై విమర్శల వెల్లువ 
  • మోడల్ కోడ్ అమలులో పక్షపాతం  
  • వెహికల్స్ చెకింగ్, డబ్బును అడ్డుకోవడంలో పోలీసులు ఏకపక్షం    
  • ఫలితాల వెల్లడిలోనూ గందరగోళం 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాల వెల్లడి దాకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ), జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసుల పనితీరు వివాదస్పమైంది. ఎలక్షన్ ప్రాసెస్ లో వారు వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిచ్చింది. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి సైతం ఏర్పడింది. గుర్తుల కేటాయింపుల దగ్గర నుంచి కౌంటింగ్ వరకు ప్రతిచోటా సీఈఓ ఆఫీసు, ఆర్ఓ విమర్శలపాలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో రాష్ట్ర సర్కార్ ఎన్నికల విధుల్లో ఉన్న ఆఫీసర్లపై కొన్ని అంశాల్లో ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులు వ్యవహరించిన తీరు, వాహనాల చెకింగ్, డబ్బు పంపిణీ, పోలింగ్ రోజు అధికార పార్టీ నేతలకు సపోర్ట్ వంటి వాటిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.  

పోలీసులు, ఆఫీసర్లు ఏకపక్షం 

ఎన్నికల కోడ్​లో భాగంగా వాహనాల చెకింగ్, కోడ్ అమలు, డబ్బు పంపిణీని అడ్డుకోవడం విషయంలోనూ పోలీసులు, ఆఫీసర్లు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీకి చెందినవాళ్లని చూసి చూడనట్లు వదిలేసి, ఇతర పార్టీ నేతల వాహనాలను మాత్రమే చెక్ చేస్తూ పోలీసులు నగదు పంపిణీని అడ్డుకున్నారు. ప్రచారం, పోలింగ్ నాడు కూడా అధికార పార్టీకి ఎన్నికల అధికారులు, పోలీసులు వంతపాడారని, పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్​ నేతలు హడావుడి చేసి, గందరగోళం క్రియేట్ చేసినా పట్టించుకోలేదని ఇతర పార్టీల నేతలు ఈసీకి కంప్లయింట్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారంలో చేసిన కామెంట్లపై కూడా ఈసీ స్పందించే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించారు.   

గుర్తుల వ్యవహారంలో ఇద్దరు ఆఫీసర్లు బలి  

బై ఎలక్షన్​లో పోటీలో ఉన్న రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు గుర్తుల కేటాయింపు విషయంలో మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఈఓ ఆఫీస్ నుంచి ఒత్తిడి రావడంతో రిటర్నింగ్ ఆఫీసర్ గుర్తుల విషయంలో తప్పిదాలకు పాల్పడినట్లు తెలిసింది. యుగ తులసి పార్టీ నుంచి పోటీలో ఉన్న కె. శివ కుమార్​కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించినప్పటికీ, ఆ గుర్తును ప్రింటింగ్​లో రాకుండా మార్చారు. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆర్ఓను మార్చింది. ఇండిపెండెంట్ కు ఒక గుర్తుకు బదులు ఇంకో గుర్తును ముద్రించడంపై చౌటుప్పల్ ఎమ్మార్వో కూడా సస్పెండ్ అయ్యారు.  

రిజల్ట్ లోనూ గందరగోళం      

ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి విషయంలోనూ గందరగోళం ఏర్పడింది. ఐదు రౌండ్లు ముగిసే వరకు ఫలితాలను ఈసీ వెబ్ సైట్​లో  సీఈఓ ఆఫీస్, ఆర్ఓ అప్​లోడ్ చేయలేదు. మీడియాకు రిలీజ్ చేయడంలోనూ జాప్యం చేశారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే.. అక్కడ వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ యా రాష్ట్రాల సీఈఓ ఆఫీస్​లు, ఆర్ఓలు అప్డేట్ చేశారు. తెలంగాణలో మాత్రం అలా జరగ లేదు. విషయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీఈఓకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతే వివరాలను అప్​లోడ్ చేశారు. దీనిపై సీఈఓ స్పందించి ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని, ఎలాంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చారు.