
- బ్యారేజీలో ప్రస్తుతం 10 టీఎంసీల నీళ్లు
- 85 గేట్లు తెరిచి ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి/మహాదేవ్‌పూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు శనివారం సాయంత్రం కుంగిపోయాయి. 6వ బ్లాక్‌లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జి షేప్ మారినట్టు కనిపిస్తోంది. మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న సిబ్బంది.. గేట్ల నుంచి శబ్దాలు రావడంతో అలర్ట్ అయ్యారు. పిల్లర్లు కుంగినట్టు గుర్తించి వెంటనే మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ చేశారు. దీంతో రెండువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. స్టాఫ్ఇచ్చిన సమాచారంతో ఇరిగేషన్ ఆఫీసర్లు అక్కడికి చేరుకుని హుటాహుటిన బ్యారేజీ గేట్లు మొత్తం 85 తెరిచి నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు. కాగా, గతేడాది కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్ లు వరదలో మునిగిపోగా.. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం గమనార్హం.
ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు..
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అత్యంత కీలకమైంది. గోదావరిలో ప్రాణహిత కలిసే చోటుకు 20 కిలోమీటర్ల దిగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్మండలంలోని అంబట్పల్లి వద్ద దీన్ని నిర్మించారు. 85 గేట్లతో నిర్మించిన ఈ రిజర్వాయర్ కెపాసిటీ 16.17 టీఎంసీలు. ప్రాణహితలో వచ్చే వరదను ఈ బ్యారేజీ నుంచే రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువకు లిఫ్ట్ చేస్తారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ మీది నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం బ్రిడ్జి కుంగిపోవడం, గేట్ల దగ్గర శబ్దాలు రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. 6వ బ్లాక్ లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్టు గమనించి ఇరిగేషన్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి ఇరువైపులా 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు బ్యారేజీ వద్దకు చేరుకుని కుంగిన రోడ్డు, పిల్లర్లను పరిశీలించారు. ఆయన సూచన మేరకు పోలీసులు రాత్రి 7:30 గంటలకు ఒక్కో వెహికిల్‌ను పంపిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే 6వ బ్లాక్పరిధిలో రోడ్డు, ఇరువైపులా ఉన్న సైడ్వాల్స్షేప్ మారిపోవడంతో పోలీసులు రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, ట్రాఫిక్‌ను వేరే రూట్లో మళ్లిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లు ఉండగా, ఇరిగేషన్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక్కో గేట్ చొప్పున మొత్తం 85 గేట్లను తెరిచి ప్రాజెక్టు ఖాళీ చేస్తున్నారు.
తెల్లారితే క్లారిటీ వస్తది..
బ్యారేజీ పిల్లర్లు కుంగినట్లు తెలుస్తోంది. కానీ చీకటి వల్ల ఏం జరిగిందో అర్థం కావడం లేదు. కాసేపట్లో క్లారిటీ ఇస్తాం.
- తిరుపతిరావు, ఇరిగేషన్ ఈఈ