నాట్లకు కైకిలోళ్లు దొర్కుతలె

నాట్లకు కైకిలోళ్లు దొర్కుతలె
  • ఈ నెలాఖరు వరకే నాట్లకు చాన్స్‌‌
  • ట్రాక్టర్లు, ఎరువుల కొరత
  • భూమిని పడావ్ పెట్టలేక రైతన్నలే సాగుచేసుకుంటున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలం సీజన్‌‌లో ఇప్పటి వరకు 90 లక్షల ఎకరాల్లో పంటలు  సాగయ్యాయి. ఈ టైమ్‌‌లో వరిసాగుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వరినాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే 24 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకునేందుకు వీలుండటంతో నాట్లు జోరందుకున్నాయి. దీంతో పలు జిల్లాల్లో వరి సాగు వేగం పుంజుకోగా నాట్లు వేసేందుకు కూలీలు దొరకడం లేదు. పొలం దున్నేందుకు ట్రాక్టర్లు, ఎరువుల కొరత వేధిస్తోంది. వీటన్నింటికీ డిమాండ్‌‌ పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కౌలు రైతులు ఇబ్బందులు పడలేక సాగుకు ముందుకు రావడం లేదు. దీంతో ఉన్న భూమిని పడావ్‌‌ పెట్టలేక రైతులే సాగు చేసుకుంటున్నరు.  

పక్క రాష్ట్రం నుంచి కూలోళ్లు
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒకేసారి నాట్లు షురూ కావడంతో కూలీలకు డిమాండ్‌‌ బాగా పెరిగింది. ఇన్నాళ్లు వరినాట్లకు కూలి ఒక్కరికి రూ.200 ఉండగా, నేడు ఆడవారికి రూ.400, మగవారికి రూ.700 ఉంది. సాధారణంగా ఐదుగురు కూలీలు ఎకరం పొలంలో వరినాట్లు  వేస్తారు. ఎకరానికి ఎంత లేదన్నా గతంలో రూ.2,000 వరకు ఖర్చయ్యేది. ఇప్పుడ కూలీల సంఖ్యతో నిమిత్తం లేకుండా గుండుగుత్తగా ఎకరానికి రూ.4,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు.  అయినా నాట్లు వేసేందుకు కూలీలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే జిల్లాలతో పాటు బీహార్‌‌ నుంచి కూలీలను మాట్లాడుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకవైపు అదును దాటిపోతున్నా కూలీలు రావడం లేదు. వారి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని అంటున్నారు. 

ఎకరానికి ట్రాక్టర్​ ఖర్చు 6 వేలు
నాట్లు ఊపందుకోవడంతో ట్రాక్టర్‌‌లకూ భారీగా గిరాకీ పెరిగింది. ట్రాక్టర్‌‌ యజమానులు పొలం దున్నేందుకు గంటల చొప్పున, ఎకరాల చొప్పున ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు. కొందరు గుండుగుత్తగా పొలాలు దున్నుతున్నరు. వరి పొలం దున్ని దమ్ముచేసి కరిగట్టు చేసి బురద పొలం నాట్లకు సిద్ధం చేయడానికి ఎకరానికి రూ.6,000 పైగా వసూలు చేస్తున్నారు. గతంలో రూ.4 వేలకు అయ్యే పనికి ఇప్పుడు అదనంగా రూ.2 వేలు ఖర్చవుతోంది. గతంలో బురదగొర్రు కిరాయి ఎడ్లు, మనిషి కలిపి  రోజువారి కూలీ రూ.800 అయ్యేది. ఈరోజు అదే పనికి రూ.1,500కు పైగా  ఖర్చవుతోంది. డిమాండ్‌‌ పెరిగినా కూలీలు రావట్లేదని రైతులు చెప్తున్నరు.

డీఏపీ, యూరియా మందుల షార్టేజ్‌‌
ఎకరం పొలం నాటడానికే ఈ ఏడు రూ.15 వేలకు పైగా ఖర్చవుతోంది. డీఏపీ 50 కిలోల బస్తాకు రూ.1,350. ఇక ఎకరానికి మూడు సార్లు యూరియా 50 కిలోల బస్తా  ఒకటి రూ.266 చొప్పున  రవాణా ఖర్చు అంతా కలిపి రూ.300 అవుతుంది. పొటాష్‌‌ కూడా అందుబాటులో లేదు. అయితే మార్కెట్‌‌లో డీఏపీ షార్టేజ్‌‌ భారీగా ఉంది. లక్ష టన్నుల డీఏపీ అవసరాలు ఉండగా పావు వంతు నిల్వలు కూడా లేవు. దీంతో డీఏపీ మందు కట్టల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నరు.

డీఏపీ ఎరువులు షార్టేజ్‌‌ ఉంది: 
డీఏపీ, పొటాష్‌‌ షార్టేజ్‌‌ ఉంది. డీఏపీ, పొటాష్‌‌లతో పాటు కొన్ని కంపెనీల ఎరువులు, యూరియా దొరకడం లేదు. ఇప్పటికే వరినాట్లకు ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుంటే ఎరువులు దొరక ఇబ్బంది అవుతోంది. కూలీలు, ట్రాక్టర్లు దొరకక ఇబ్బందులు పడుతున్నం. మాకున్న 20 ఎకరాల్లో ఇప్పటికే 16 ఎకరాల్లో నాట్లు వేయడానికి పాట్లు పడ్డాం. ఇంకా నాలుగు ఎకరాలు వేయాల్సి ఉంది.
-జులకంటి వెంకట్‌‌రెడ్డి, రైతు, చౌటపల్లి, మండలం కుసుమంచి ఖమ్మం 

ఎకరానికి 4,500 ఇచ్చినా కూలీలు దొరకుతలేరు: 
పది రోజులుగా కూలీలు దొరకడం లేదు. ఎకరానికి రూ.4,500 ఇచ్చినా మాకున్న ఐదెకరాల పొలంలో సగమే వేసిన్రు. దున్ని సిద్ధం చేసి ఇప్పటికే వారం అవుతోంది. మా ఊర్లో కూలీలు దొరకక వేరే జిల్లా నుంచి కూలీలను ఆటో ఖర్చులు ఇచ్చి మరీ తెప్పించు కుంటున్నం. 
- తోట నర్సిరెడ్డి, రావిపాడు, సూర్యాపేట జిల్లా