అకాల వర్షాలకు ఆగమవుతున్న రైతన్న

అకాల వర్షాలకు ఆగమవుతున్న రైతన్న

వెలుగు, నెట్వర్క్అకాల వర్షాల కారణంగా రైతులు ఆగమవుతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో కురిసిన వానలకు కోతకొచ్చిన వరి నేలకొరిగింది.  కోసిన వరిమెదలు, వడ్లు, ఆరబోసిన మక్కలు తడవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఉమ్మడి మెదక్​ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం  మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. హవేలి ఘనపూర్, మెదక్, నిజాంపేట, రామాయంపేట, కొల్చారం, వెల్దుర్తి, పాపన్నపేట మండలాల్లో వానాకాలంలో సాగుచేసిన వరి కోతలు మొదలు కాగా, మెదలు నీట మునిగాయి. హవేలి ఘనపూర్​ మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో నూర్పిళ్లు జరుగగా రైతులు రోడ్ల మీద ఎండబోసిన వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షాలకు కోటగిరి, మోస్రా, సిరికొండ, ఇందల్ వాయి మండలాల్లో రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిశాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, బీబీపేట, మాచారెడ్డి మండలాల్లో రెండు గంటలకు పైగా కురిసిన వర్షానికి చాలాచోట్ల వరి నేలకొరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు  వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. తాజా వానలతో నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ వాగు పొంగడంతో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. సమీపంలోని కొందరు గ్రామస్తులు ట్రాక్టర్ లో ఉన్న ఆరుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కోయిల్ సాగర్  ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షాలకు పలుచోట్ల వరి పంట నేలవాలింది. వరంగల్​ అర్బన్​, మహబూబాబాద్​, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలుచేయాలని పలు జిల్లాల రైతులు కోరుతున్నారు.

వానలకు కూలిన ఇల్లు.. ఇద్దరు మృతి

గ్రేటర్ హైదరాబాద్ లో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు పాతబస్తీ హుస్సేనీఆలంలోని రేకుల ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. పాత భవనాలను గుర్తించి, ఖాళీ చేయించాలని కమిషనర్ ఆదేశించినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆదివారం కూడా సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 6.3, పఠాన్​చెరువులో 6.2, ఆర్సీపురంలో 5.9, కూకట్​పల్లిలో 5.5, కుత్బుల్లాపూర్​2.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీకి 174 ఫిర్యాదులు వచ్చాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాన్ సూన్, డీఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. వానలతో ఇబ్బందులుంటే ప్రజలు జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040––-21111111 లేదా 100కి కాల్ చేయాలని సూచించారు.

ఇయ్యాల్టి నుంచి పెద్ద వానలు

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, రానున్న 24 గంటల్లో అది తీవ్రమవుతుందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వానలు పడ్డాయి. 11 ప్రాంతాల్లో భారీ, 135 చోట్ల మోస్తరు, 226 చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. నారాయణ పేట జిల్లాలోని మొగల్‌మడ్కలో 10.2, సిద్దిపేటలోని హబ్షిపూర్‌లో 9.7, సంగారెడ్డిలో దిగ్వాల్‌లో 9.1, కోహిర్‌లో 8.7, సిద్దిపేటలోని కొండపాకలో 7.6, సంగారెడ్డిలోని అల్మాయిపేట్‌లో 7.3, మెదక్‌లోని నర్సాపూర్‌లో 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.