ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !

ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !

రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. ఫోన్​ట్యాపింగ్​ను గత బీఆర్​ఎస్​ సర్కారు తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్టు తెలిసింది. ఎంతమంది ఫోన్లను ట్యాప్​ చేశారో లెక్కకూడా తేలకపోగా.. ప్రతిపక్షంతో పాటు స్వపక్షంపైనా దీన్ని ప్రయోగించనట్టు బయటపడింది. అదే సమయంలో ఢిల్లీ పెద్దల కదలికలపైనా ట్యాపింగ్​ అస్ర్తం ప్రయోగించినట్టు తాజాగా తేలింది. కేంద్ర మంత్రులు, వారికి దగ్గరగా ఉన్న ఆఫీసర్లు, వ్యక్తులపైనా ఫోన్​ ట్యాపింగ్​ గురి పెట్టినట్టు పోలీసు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.   అధికారిక ప్రొసీజర్​ ఫాలో కాకుండానే.. అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ఎవరి నంబర్లు వస్తే వారందరి  ఫోన్లను ట్యాప్​ చేసినట్టు తేలింది

ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులు,  వారి ఆఫీస్ సిబ్బంది, సన్నిహితులతో పాటు  బీజేపీలోని ముఖ్యమైన లీడర్ల ఫోన్లు ట్యాప్​ చేసినట్టు ఎంక్వైరీలో అధికారులు నిర్ధారణకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది? దానికి అనుగుణంగా రాష్ట్రంలో  ఎలా ముందుకు వెళ్లాలి ? అనేది ఆలోచించుకుని ప్రకటనలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో ఏయే వ్యాపార దిగ్గజాలు.. ఎలాంటి వ్యవహారాలు నడుపుతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ట్యాపింగ్​కు పాల్పడినట్టు ఎంక్వైరీలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్​ ట్యాపింగ్​ను అస్త్రంగా వాడుకున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. 

ఇతర కేసులు పెట్టేందుకు సిద్ధం

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో ఇతర కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఇష్యూ ఒక్క ట్యాపింగ్​కే పరిమితం కాలేదని అంటున్నారు. ఇల్లీగల్​ ట్యాపింగ్​ చేసినట్టు నిరూపిస్తే తక్కువ శిక్ష, ఫైన్​తో బయటపడేందుకు చాన్స్​ ఉంటుందని తెలిపారు. అలా కాకుండా అక్రమ ట్యాపింగ్​తో ఎలాంటి తప్పులు చేశారు? వాటి పర్యవసనాలు ఏమిటి? అనే దాని ఆధారంగా పెద్ద ఎత్తున కేసులు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు పోలీసు అధికారుల వరకే పరిమితమైన ట్యాపింగ్​ వ్యవహారం.. త్వరలోనే బీఆర్​ఎస్​ లీడర్లు, మాజీ మంత్రుల మెడకు చుట్టుకోనున్నట్టు తెలిసింది. కొందరికి నోటీసులు జారీ చేసి.. విచారణకు పిలుస్తారనే చర్చ నడుస్తున్నది.