
Bitcoin News: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలకు భారీగా ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రఖ్యాత ఇన్వెస్టర్లు సైతం క్రిప్టోలకు తమ సపోర్ట్ ప్రకటించటంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వీటికి అనుకూలంగా ఉండటం కొన్ని ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే కరోనా సమయంలో భారీగా క్షీణించిన బిట్‌కాయిన్ ఆ తర్వాత మెగా ర్యాలీని చూస్తోంది. గతవారం బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును చేరుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే రానున్న 10 ఏళ్ల కాలంలో బిట్‌కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా చెల్లింపుల్లో అమెరికా డాలర్లను రీప్లేస్ చేస్తుందని బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ టిమ్ డ్రేపర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కరెన్సీగా మారి దీని ధర 2లక్షల 50వేల డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే రానున్న దశాబ్ధకాలంలో బిట్‌కాయిన్ ధర ప్రస్తుతం కంటే ఒకటిన్నర రెట్లు పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. బిట్‌కాయిన్ డాలర్‌ను సవాలు చేయడమే కాకుండా అమెరికన్ ఆర్థిక విధానాలపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోందని అమెరికాలోని దిగ్గజాలు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న రుణ సంక్షోభం ఇలాగే కొనసాగి తీవ్రమైతే రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న అవ్వొచ్చని వాల్ స్ట్రీట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అసలు బిట్‌కాయిన్ సురక్షితమైనదేనా అనే అనుమానాలు రోజురోజుకూ సాధారణ ప్రజల్లో పెరిగిపోతున్నాయి. వాస్తవానకి 1989లో అమెరికా రుణాలు జీడీపీలో మూడు రెట్లు పెరిగాయని.. కానీ ప్రస్తుతం వాటికి కేవలం వడ్డీ చెల్లింపుకే 952 బిలియన్ డాలర్లు ఖర్చవుతోందని డ్రేపర్ అన్నారు. వాస్తవానికి ఇది యూఎస్ డిఫెన్స్ వ్యయాలకంటే ఎక్కువని.. రానున్న కాలంలో రుణ సంక్షోభం కారణంగా డాలర్ విలువ పతనం కాయమని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల బిట్‌కాయిన్ మెరుగైన టెక్నాలజీగా డ్రేపర్ అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం రిజర్వు కరెన్సీగా చెలామణి అవుతున్న డాలర్ హోదాకు పెరుగుతున్న యూఎస్ జాతీయ రుణం పెద్ద ముప్పని బ్లాక్ రాక్ సీఈవో లారీ ఫింక్ హెచ్చరించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఒకవేళ అమెరికా తన అప్పులను నిర్వహించలేకపోతే.. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డాలర్‌ను భర్తీ చేయగలవని అభిప్రాయపడ్డారు. మెుత్తానికి ప్రస్తుతం యూఎస్ జాతీయ అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ట్రంప్ అధికారంలోకి రావటానికి ముందు ఎన్నికల సమయంలో అమెరికాపై ఉన్న ఈ రుణ భారాన్ని తగ్గిస్తానని వాగ్దానం చేశారు. అందులో భాగంగానే అనేక ఖర్చులను తగ్గించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.