అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కేవలం స్టాక్ మార్కెట్లనే కాదు.. క్రిప్టో ప్రపంచాన్ని కూడా ఒక ఊపు ఊపేస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న బిట్‌కాయిన్.. ఒక్కసారిగా 72వేల డాలర్ల మార్కును తాకింది. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ భౌగోళిక రాజకీయ రక్షణ కవచంలా కాకుండా.. గ్లోబల్ రిస్క్ అసెట్ లాగా ప్రవర్తిస్తోందని క్రిప్టో మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. అంటే ప్రపంచంలో శాంతి నెలకొంటేనే క్రిప్టో మార్కెట్ పరుగులు పెడుతుందని.. ఉద్రిక్తతలు పెరిగితే వెనకడుగు వేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని గమనిస్తే.. బిట్‌కాయిన్ 71వేల డాలర్ల నుంచి 71వేల 700 మధ్య స్థిరంగా ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇథీరియం సైతం 2వేల 250 స్థాయికి చేరుకోగా.. సోలానా, ఎక్స్‌ఆర్‌పీ వంటి ఆల్ట్‌కాయిన్లు 4-6 శాతం లాభాలను అందించాయి ఇన్వెస్టర్లకు. అయితే ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇది కేవలం ఉద్రిక్తతలు తగ్గడం వల్ల వచ్చిన రిలీఫ్ ర్యాలీ మాత్రమేనని. ఇది దీర్ఘకాలిక బుల్ రన్‌కు సంకేతమా అంటే ఇప్పుడే చెప్పలేం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బిట్‌కాయిన్ ఇంకా తన గరిష్ట స్థాయి లక్షా 20వేల డాలర్ల కంటే చాలా తక్కువలోనే ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
క్రిప్టో భవిష్యత్తును నిర్ణయించే మూడు కీలక అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మొదటిది ఈ రెండు వారాల కాల్పుల విరమణ ఎంతవరకు నిలబడుతుందనేది. ఒకవేళ మళ్లీ యుద్ధం మొదలై ఆయిల్ ధరలు పెరిగితే.. క్రిప్టో మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. రెండోది ఏప్రిల్ 10న విడుదలయ్యే అమెరికా ద్రవ్యోల్బణం డేటా. ఇది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. దీని ద్వారా క్రిప్టో లిక్విడిటీ మారుతుంది. మూడోది బిట్‌కాయిన్ ఈటీఎఫ్ లలోకి వచ్చే పెట్టుబడులు. మార్చిలో సుమారు రూ.12వేల కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి. ఇది మంచి పరిణామమే అయినా.. ఈ జోరు నిలకడగా కొనసాగాల్సి ఉంది.
సామాన్య ఇన్వెస్టర్లకు నిపుణులు ఇచ్చే సలహా ఒక్కటే.. మార్కెట్ పెరుగుతోందని కంగారుపడి భారీగా పెట్టుబడులు పెట్టకండి అన్నదే. బిట్‌కాయిన్‌కు 72వేల నుంచి 75వేల డాలర్ల వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రిప్టోల రేట్లు తగ్గినప్పుడు మాత్రమే చిన్న చిన్న మొత్తాల్లో అక్యూమిలేట్ చేయడం లేదా క్రిప్టోలలో SIP రూపంలో పెట్టుబడులు పెట్టడం బెటర్ అని వారు సూచిస్తున్నారు. రెండు వారాల తర్వాత క్రిప్టో మార్కెట్‌లో ఎలాంటి షాక్ తగిలినా నష్టపోకుండా ఉండాలంటే.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఆచితూచి అడుగు వేయటం బెటర్ అని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ర్యాలీ కేవలం ఒక ఆశా కిరణం మాత్రమేనని.. పూర్తి స్థాయి లాభాల పంట కావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని చెబుతున్నారు.
