అర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి

అర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి :  సీఎస్ శాంతి కుమారి

ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల  రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో రుణమాఫీ, జీ. ఓ. 58, 59, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, నివాస స్థలాల పట్టాల పంపిణీ, జీపీ భవన నిర్మాణం,  హరితహారం తదితర అంశాలపై సమీక్ష  నిర్వహించారు. 

దీనికి  కలెక్టర్ వి.పి.గౌతమ్, అదనపు కలెక్టర్లు సత్య ప్రసాద్, మధుసూదన్ నాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ నిధులు బ్యాంకులలో జమ చేశామన్నారు.  ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

 ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జి. ఓ.నం. 58, 59 ద్వారా అవకాశం కల్పించి 58 లబ్ధిదారులకు పట్టాలు అందించిందన్నారు. 59 క్రింద దరఖాస్తు చేసుకున్న వారికి నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ రుసుము చెల్లించిన వారి భూముల క్రమబద్ధీకరణకు చర్యలు తెలిపారు. 

సొంత ఇంటి  స్థలం కలిగిన  వారికి  గృహలక్ష్మి పథకం కింద  అప్లై​చేసుకున్న వారి   వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఆసరా పెన్షన్ పొందుతూ మరణిస్తే కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేసి మరింత సాగు విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. సమీక్షలో  డీఎఫ్​వో సిదార్ద విక్రమ్ సింగ్, డీఆర్డీవో పీడీ విద్యాచందన, డీఏవో సరిత, హార్టికల్చర్​ ఆఫీసర్​ అనసూర్య, సీఈవో అప్పారావు,  తదితర అధికారులు పాల్గొన్నారు.