వ్యాక్సిన్ సెకండ్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలె

వ్యాక్సిన్ సెకండ్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలె
  • సీఎస్ సోమేశ్​ కుమార్

హైదరాబాద్, వెలుగు: సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్​ను సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ సోమేశ్​ కుమార్ సూచించారు. శనివారం గ్రేటర్​లో సెకండ్​ డోస్ వ్యాక్సినేషన్​ డ్రైవర్ ప్రారంభం కాగా.. రాజేంద్రనగర్​ సన్ రైజ్ హోం కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్​ను సోమేశ్​ కుమార్ పరిశీలించారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందజేశామన్నారు.  ఫస్ట్​డోస్ వేసుకున్న వారు సెకండ్​ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సిటీలో దాదాపు 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం మరో 10 రోజుల పాటు  150 మొబైల్  వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా సెకండ్ డోస్ ఇస్తామని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. సిటీలో రెండు, మూడు కాలనీలకు ఒక ప్రత్యేక మొబైల్ వ్యాక్సిన్ సెంటర్​ను ఏర్పాటు చేశామని బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ చెప్పారు.  డైలీ 450 కాలనీలను కవర్ చేస్తామని, అవసరమైతే వాక్సినేషన్ డ్రైవ్​ను మరిన్ని రోజులు పొడిగిస్తామన్నారు.

మల్క చెరువులో మోడల్ ప్లాంటేషన్​ను పరిశీలించిన సీఎస్ సిటీలో చెరువుల గట్లు, శిఖం భూములు, ఖాళీ స్థలాల్లో చేపడుతున్న మోడల్ ప్లాంటేషన్​ను సీఎస్​ సోమేశ్​ కుమార్ పరిశీలించారు.  అత్తాపూర్ లోని మల్క చెరువులో చేపట్టిన మోడల్ ప్లాంటేషన్​ను పరిశీలించిన ఆయన అక్కడ మొక్కలు నాటారు. సీఎస్​ మాట్లాడుతూ..   అన్ని చెరువుల దగ్గర మొక్కలను నాటే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లో నీటి మట్టం తగ్గగానే అక్కడ నీటి కానుగ (బేరింగ్ టోనియా) మొక్కలను నాటాలన్నారు.  మల్క చెరువులో దాదాపు 30 రకాల వృక్ష జాతుల మొక్కలను నాటినట్లు సీఎస్​కు బల్దియా అధికారులు తెలిపారు.  కార్యక్రమంలో బల్దియా అడిషనల్ కమిషనర్ కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.