
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం అధికారులతో సీఎస్టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 26న అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో హాజరయ్యే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తగిన బందోబస్తు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు సకాలంలో అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.
గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా..
ఈ నెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుకు నమోదయ్యే అవకాశం ఉందని.. ఈ కార్యక్రమంలో 10 వేలకు పైగా మహిళలు పాల్గొంటారని సీఎస్ తెలిపారు. వేదిక ఏర్పాట్లు, విద్యుదీకరణ, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సదుపాయాలు పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు.
అలాగే, 27న ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా, 30న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న ఇతర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.