
- సీఎస్‌బీ ద్వారా నిరుడు ఫిబ్రవరి నుంచి రూ.281 కోట్లు రిఫండ్
- 30,478 మందికి ఊరట
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల బాధితులకు నేషనల్ మెగా లోక్ అదాలత్‌లో ఊరట లభిస్తోంది. ఆన్‌లైన్ మోసాలు సహా సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును పోలీసులు లోక్ అదాలత్ ద్వారా తిరిగి అప్పగిస్తున్నారు. శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో రాష్ట్రవ్యాప్తంగా 6,294 సైబర్ నేరాలు, 1,87,145 సాధారణ నేరాలు సహా మొత్తం 1,93,439 కేసులు పరిష్కారం అయ్యాయి. తీవ్రమైన నేరాలు మినహా రాజీ కుదుర్చుకునే కేసులను పోలీసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించారు.
సైబర్ నేరాలు అత్యధికంగా నమోదైన గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 3,509 కేసులకు రూ.38.17 కోట్లను బాధితులకు అందించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన 172 కేసుల్లో రూ.5.74 కోట్లు సెటిల్ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) ద్వారా గతేడాది ఫిబ్రవరి నుంచి 30,478 మంది సైబర్ బాధితులకు రూ.281.1 కోట్లు రిఫండ్ చేశారు. ఈ ఏడాది జరిగిన రెండు మెగా లోక్ అదాలత్‌ల ద్వారా 11,832 మంది బాధితులకు రూ.97.18 కోట్లు రిఫండ్ చేశామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. www.cybercrime.gov.in, 1930 హెల్ప్‌లైన్ నంబర్లకు అందిన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బను ఫ్రీజ్ చేస్తున్నామని తెలిపారు. అలా ఫ్రీజ్ చేసిన డబ్బును లోక్ అదాలత్ ద్వారా బాధితులకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు.